కర్ణాటకలో ఆ పార్టీ ఎన్నికల ఖర్చు రూ.6500 కోట్లా?

Tuesday, May 22nd, 2018, 09:08:51 AM IST

కర్ణాటక ఎన్నికలు ఎన్నడు లేనంత రసకందాయం మధ్య మొత్తానికి ముగిసాయి. తొలుత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయదలచిన యెడ్యూరప్ప కావలసిన అభ్యర్థుల బలం లేక మూడు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత కాంగ్రెస్, జెడిఎస్ ల కలయికలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. జేడీఎస్ అధినేత కుమారస్వామి రేపు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్ నేతలను ఎన్నో రకాలుగా ప్రలోభపెట్టిన బిజెపి చివరికి న్యాయం ముందు తలవంచవలసివచ్చిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు బిజెపి ఈ ఎన్నికల్లో దాదాపు రూ.6500 ఖర్చు చేసిందని, ఎలాగయినా అధికారం దక్కాలని మరొక రూ.4000 కోట్లతో ఎమ్యెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసిందని ఏఐసిసి నాయకుడు ఆనంద్ శర్మ నిన్న ఢిల్లీ లో మాట్లాడుతూ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై త్వరోనే దర్యాప్తు జరిపి నిజానిజాలను తేల్చాలని డిమాండ్ చేశారు.

నిజానికి దేశంలోనే కాదు, ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్న పార్టీ బిజెపి అని, ఆ పార్టీ ఉన్నంత గొప్ప కార్యాలయం మరి ఏ పార్టీకి కూడా లేదని అన్నారు. కాగా నిన్న అమిత్ షా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేస్తే, తాము ఎన్నికల్లో చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణలు చెపుతారని అనుకున్నామని, కానీ అలా కాకుండా కాంగ్రెస్, జేడీఎస్ ల అపవిత్ర కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని అనడం హాస్యాస్పదం అన్నారు. అయినా అతిపెద్ద పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు వుంది అంటున్న అమితాషా తదితర బిజెపి నేతలకు ఆ పద్దతిని గోవా, మేఘాలయ, మణిపూర్ లలో ఎందుకు అమలు చేయలేకపోయారు అని అన్నారు. కావున ఇప్పటికైనా బిజెపి నేతలు ప్రలోభాలతో ఏమి చేయలేరనే నిజాన్ని తెలుసుకోవాలని, అందుకే సుప్రీమ్ కోర్ట్ కూడా న్యాయం వైపే నిలిచి తీర్పు ఇచ్చిందని, ఇకనైనా బిజెపి నేతలు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తే బాగుంటుందని ఆనంద్ శర్మ హితవు పలికారు…..

  •  
  •  
  •  
  •  

Comments