ఆ పార్టీలకు ఎన్నికలకొచ్చే దమ్ముందా?

Monday, June 4th, 2018, 08:27:34 AM IST

2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలవేడి ఇపుడిపుడే మొదలవుతోంది. ఓవైపు వైసిపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్ ప్రజల్లోకి వెళ్ళి పర్యటనలు చేస్తుంటే మరోవైపు టీడీపీ రాష్ట్రంలో నవనిర్మాణ దీక్షలు చేస్తోంది. కాగా నిన్న కర్నూల్ జిల్లా జొన్నగిరి నవనిర్మాణ దీక్ష సభలో మాట్లాడిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసిపి, బిజెపి నేతలు తమపై కక్షతో కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికే తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేశామని చెపుతున్న వైసిపి ఎంపీల రాజీనామాలు ఇప్పటివరకు ఎందుకు ఆమోదించబడలేదు, ఇప్పటికిప్పుడు ఆమోదించుకుంటాం అని కట్టు కథలు ఎందుకు చెపుతున్నారన్నారు.

నిజానికి వారికి తిరిగి ఎన్నికలకు వెళ్లేందుకు భయమని, ఉపఎన్నికల్లో ప్రజలు వారిని ఓటమిపాలు చేస్తే తమ అసలు ప్రభావం బయటపడుతుందని భయపడి ఇప్పటివరకు రాజీనామాల ఆమోదం పొందలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో తాము రాష్ట్రంలో మొత్తం 25కి 25 లోక్ సభ సీట్లను సొంతం చేసుకుని వైసిపి, బీజేపీల నోటికి కళ్లెం వేస్తామన్నారు. బిజెపి నేతలు కేంద్రం నిధులు ఇచ్చింది, చేయాల్సినవన్నీ చేసింది అని అబ్బద్దపు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కూడా బిజెపి రాదని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఓవైపు తాము విభజన హామీలు, ప్రత్యేక హోదాపై బీజేపీ మోసం చేసిందని దీక్ష చేపడితే, తమ దీక్షను అపహాస్యం చేస్తూ వంచన దీక్ష పేరుతో వైసిపి దీక్ష చేపట్టడం నీచమన్నారు. తన ప్రభుత్వంలో ప్రజలకు, రాజధాని నిర్మాణానికి నిరంతరంగా కృషి చేస్తున్నామని, ఇదంతా ప్రతిపక్షాలకు ఎందుకు కనపడడంలేదు అని ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్ మా పార్టీ నేతలు ఇసుక దందాలు చేస్తూ ఇసుకను అమ్ముకుంటున్నామని లేనిపోని నిందలేస్తున్నారు. నిజానికి కొన్ని ప్రాంతాల్లో వారు అక్కడి ఇసుకను మేము కూడా తీసుకుంటామని అడిగితే ఉచితంగా ఇస్తున్నాం, ఇక ఇసుక కావలసిన వారికీ ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వానికి రావలసిన దాదాపు రూ.500 కోట్లవరకు వదులుకున్నాం. నేను మా పార్టీ నేతలు సాంకేతికంగా, నీతివంతమైన, న్యాయవంతమైన పాలనతో మన రాష్ట్రాన్ని అన్నివిధాలా అగ్రగామిగా నిలబెట్టేలా పాలన అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే వైసిపి, బీజేపీలు మాత్రం తమపై లేనిపోని నిందలేస్తున్నాయని, అయినా ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి తప్పకుండ బుద్ధి చెపుతారని అన్నారు. రాష్ట్రం లో బిజెపి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చోట్ల గల్లంతవుతుందని, వైసిపి పరిస్థితి కూడా దాదాపుగా అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటివారికి బుద్ధి చెప్పేది ఎన్నికలేనని, కాబట్టి తమ్ముళ్లు వచ్చే ఎన్నికల్లో మళ్ళి మన ప్రభుత్వాన్ని గెలిపించుకుని కేంద్రంలో ఎవరొచ్చినా సరే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక తీసుకువద్దామని ఆయన అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments