వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయమా కేసీఆర్ గారు : విహెచ్

Tuesday, April 10th, 2018, 05:50:59 PM IST

తనకు అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అలానే టిఆర్ ఎస్ పార్టీ పై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంత రావు. కేసీఆర్ ది నియంతృత్వ పాలన అని, ఆయన గత ఎన్నికల్లో విజయం తరువాత కేవలం అయన కుటుంబీకులకు మాత్రమే న్యాయం చేసుకుంటున్నారని పలు సందర్భాల్లో మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దొరల పాలన జరుగుతోందన్నారు.

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని ప్రకటించి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. డబ్బుల సంపాదన కోసం సినిమాలు తీసే వారికి స్టేడియాలు ఇస్తున్నప్పుడు, తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడే కోదండరామ్‌ సభకు అనుమతి ఎందుకు ఇవ్వరని సీఎంను సూటిగా ప్రశ్నించారు. కోదండరామ్‌ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు అనుమతి ఇవ్వడం లేదంటే కేసీఆర్‌ పరిపాలన అంతిమ దశకు చేరుకుందని అన్నారు. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా తనకు ప్రశ్నించే హక్కు ఉందని వీహెచ్ స్పష్టం చేశారు. కావున కేసీఆర్ ఇప్పటికైనా తన నియంతృత్వ పోకడలకు స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని హితవు పలికారు….

  •  
  •  
  •  
  •  

Comments