కుమారస్వామి విషయంలో ఈ సారి ఆ సెంటిమెంట్ ఫలిస్తుందా?

Friday, May 25th, 2018, 10:45:02 PM IST

కర్ణాటక ఎన్నికలు ఎట్టకేలకు పూర్తి అవడం. వెనువెంటనే ఫలితాలు రావడం, తొలుత యెడ్యూరప్ప కు సరిపోయినంత మంది అభ్యర్థులు లేకపోయినా గవర్నర్ వాజు భాయ్ ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, తరువాత సుప్రీమ్ తీర్పుతో ఆయన రాజీనామాచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్, జేడీఎస్ ముందుకి రావడం, ఎట్టకేలకు బుధవారం కుమారస్వామి 12 ఏళ్ళ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇలా ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి. మొత్తానికి అంతా సుఖాంతమైంది అనుకుంటున్నా సందర్భంలో సీఎంగా గద్దెనెక్కిన కుమారస్వామికి ఇప్పుడు మనసులో ఒక కొత్త గిలి ఏర్పడినట్లు తెలుస్తోంది.

నిజానికి అది గిలి కాదని, ఇదివరకు చాలాసార్లు అలా జరిగిందని, మళ్ళి అలానే జరిగే ఛాన్స్ లేకపోలేదని జేడీఎస్ నేతలు కలవరపడుతున్నారట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే. ఇదివరకు కర్ణాటక ముఖ్యమంత్రులు రాజ్ భవన్ లో గవర్నర్ ఎదుట, సభ్యులందరి సమక్షంలో సాధారణరీతిలో ప్రమాణ స్వీకారం చేసేవారట. అయితే ఆ తరువాత 1993 నుండి విజయసౌథలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంతురులు ఎవరూ కూడా పూర్తి స్థాయిలో, అంటే ఐదేళ్ల పాటు సీఎం స్థానంలో కొనసాగలేదని తెలుస్తోంది. 1993 లో అప్పటి జనతాదళ్ పార్టీ సీఎం రామకృష్ణ హెగ్డే విజయసౌథ ఎదుటే ప్రమాణస్వీకారం చేసి అదే ఏడాదిలో మద్యం కాంట్రాక్టుల విషయంలో ఆరోపణలతో ఏడాదిలోగా పదవిని కోల్పోయారట.

అలానే 1990లో బంగారప్ప కూడా ముఖ్యమంత్రిగా విజయ సౌధలో ప్రమాణ స్వీకారం చేసి ఆ తరువాత కావేరి జలవిషయంలో అల్లర్లు జరగడంతో రెండేళ్లలో గద్దె దిగవలసి వచ్చింది. ఇక 2006లో ఇదే కుమారస్వామి విజయసౌథ లోనే ప్రమాణస్వీకారం చేసి 20 నెలలలో పదవిని కోల్పోయారు. ఇక 2008లో యెడ్యూరప్ప కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి తరువాత అవినీతి ఆరోపణలతో మూడేళ్ళలో రాజీనామా చేసారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం అదే విజయసౌథలో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన కుమారస్వామి పరిస్థితి ఏమవుతుందో, అసలు ఆయన ఐదేళ్లపాటు సీఎం గా కొనసాగుతారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమి జరుగుతుందో, కాలం ఏమి నిర్ణయిస్తుందో తెలియాలంటే, కొన్నాలు ఓపికపట్టాల్సిందే మరి…..

  •  
  •  
  •  
  •  

Comments