గంటా శ్రీనివాసరావు వ్యూహం అదేనా?

Sunday, June 24th, 2018, 02:10:37 PM IST

అధికార టీడీపీలో మానవవనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న గంటా శ్రీనివాసరావు గత కొద్దిరోజుల నుండి ఆ పార్టీపై కొంత నిరాసక్తతతో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా ముభావంగా వున్న అయన మొన్న జరిగిన టీడీపీ కాబినెట్ సమావేశానికి కూడా హాజరుకాలేదని తెలుస్తోంది. అయితే మొదట చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో కీలకపాత్ర వహించి ఆ తరువాత కాంగ్రెస్ లోకి, ఆపై ప్రస్తుతం టీడీపీ లోకి జంప్ అయిన గంటా మొదటి నుండి చిరంజీవి కుటుంబానికి మంచి సన్నిహితులనే విషయం తెలిసిందే. ఆయన కుమారుడి చిత్ర రంగప్రవేశం విషయమై చిరంజీవి నేతృత్వంలోనే జయంత్ దర్శకత్వంలో అరంగేట్రం చేయించినట్లు తెలుస్తోంది.

ఇకపొతే ఇటీవల ప్రజాపోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా విశాఖ జిల్లా లో ప్రవేశించే సమయంలో భీమిలి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అయన పర్యటన తాలూకు కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించింది గంట అనుచరులేనని అప్పట్లో వార్తలు కూడా వెలువడ్డాయి. కాగా ప్రస్తుతం ఆయన టీడీపీ పై కొంత మేర నిరాసక్తత వున్న ఆనం రామనారాయణ రెడ్డిని కలవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఆనం కూడా పార్టీ మారే విధంగా పావులు కదుపుతున్నారని, ఈ సమయంలో గంటాతో సహా ఆయన కూడా బయటకు వెళ్లనున్నట్లు సమాచారం. చిరంజీవి మాదిరి, జనసేన అధినేత పవన్ తో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉండడంతో రానున్న ఎన్నికల వేళ జనసేన తీర్థం తప్పక పుచ్చుకోగలరని వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే తన సామజిక వర్గానికి మంచి పట్టున్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నియోజక వర్గాల్లో గంటాకు మంచి పేరు ఉండడంతో ఆయనకు సముచితస్థానం కల్పించాలనే యోచనలో పవన్ కూడా ఉన్నట్లు చెపుతున్నారు. మెజారిటీ సీట్లు అక్కడ కైవశం చేసుకోవడానికి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళవలసిన ప్రణాళిక గంట, పవన్ లు రచించారని అది కూడా అయన భవిష్యత్ వ్యూహంలో భాగమని అంటున్నారు. అంతేకాక పవన్ ఆలోచనలకు కార్యరూపమించేలా గంట వంటి సీనియర్లు జనసేనకు కొంతమేర అవసరమని, అందుకే పవన్ కూడా ఆయనకు మొగ్గు చూపుతున్నట్లు చెపుతున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ప్రస్తుతం గంట పార్టీ మారే విషయమై టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది….