స్త్రీ విశృంఖ‌ల‌త‌! ఇదేం న్యాయం? ఇదేం తీర్పు?!

Tuesday, October 9th, 2018, 11:00:56 PM IST

మహిళా స్వేచ్ఛ విశృంఖ‌ల రూపం దాల్చుతోంది! స్వేచ్ఛ‌ పేరిట మహిళలకు వివాహేతర లైంగిక స్వేచ్ఛ, గే స్వలింగ సంపర్కం… వంటి సంచలనమైన తీర్పులు చూస్తుంటే భారతీయ సంస్కృతిపై ఓ పథకం ప్రకారం జరుగుతున్న దాడిగా కనిపిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అసలు భారతీయతే… సనాతన సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వ, నైతిక పునాదులపై ఏర్పడింది. ప్రపంచ దేశాలన్నీ కొనియాడేంత గొప్ప గౌరవం.. మన దేశానికీ, మన వివాహ వ్యవస్థకు, మన దేశంలోని మహిళకు మాత్రమే ఉంది. చెడిపోయినవారు, చెడు ఆలోచనలు ఉన్నవారిని పక్కన పెడితే.. ఈ తీర్పులు సగటు భారతీయ మహిళకు గౌరవం తెచ్చి పెడతాయా? భావితరాలపై చెడు ప్రభావం చూపదా? మహిళల వివాహేతర సంబంధాలు నేరం కాదూ? అది కేవలం నైతిక తప్పిదమేనన‌డంలో అంతరార్థం ఏమిటి? వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తల్లో ఎవరో ఒకరు చస్తే కేసు పెట్టుకోవచ్చట. లేదంటే విడాకులు కోరవచ్చట… అంటే కోర్టులే .. మేం చెబుతున్నాం గనుక.. భర్త ఉన్నా.. నీకు నచ్చినవాడితో లైంగిక సంబంధాలు పెట్టుకో అనే భ‌రోసాని ఇవ్వ‌డ‌మే ఇది.

నువ్వు మాత్ర‌మే బావుండు.. నువ్వే బావుండు!! హాయి `గా` `సుఖం`గా, `స్వేచ్ఛ`గా జీవించు.. నీ కుటుంబం ఏమైపోయినా ఫర్వాలేదు… ఇదా అత్యున్నత స్థానంలో ఉన్న న్యాయమూర్తులు చెప్పే న్యాయం? అస‌లు మ‌నం ఎటెళ్లిపోతున్నాం? కులమతాలకు అతీతంగా భారతీయ సామాజిక నైతికతను దెబ్బ తీసే ఇలాంటి తీర్పుల ప్రభావంతో సమాజం మరింత దిగజారిపోదా? అప్పుడు లైంగిక విశృంఖలత పెరిగిన కొన్ని పాశ్చాత్య దేశాలకూ మనకూ తేడా ఏమిటి? నేరస్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడం తమ పని కాదని… అది పార్లమెంటులో చట్టం చేసుకోవాలని చెప్పిన న్యాయాధిపతులు…, చట్టసమ్మతం లేకుండా… సమాజంపై దారుణ ప్రభావం చూపే ఇలాంటి సామాజిక అంశాలపై ఎవరో ఓ వ్యక్తి ఫిర్యాదునే ప్రాతిపదికగా తీసుకుని సొంతంగా ఎలా తీర్పులు ఇస్తారు? నిన్నటికి నిన్న.. పార్లమెంటులో చట్టంచేసినా ఎస్టీ, ఎస్సీల హక్కులను కాలరాయాలని చూడలేదా?.. అసలు ఇలాంటి తీర్పులు ఇచ్చిన వ్యక్తుల కుటుంబాల్లోని వివాహితలు వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఉంటే ఇలాంటి తీర్పులే ఇచ్చేవారా? దీన్నిబట్టి వారి నైతికత ఏంటి? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం ఉంది.. దానిని కించ‌ప‌ర‌చ‌డం ఉద్ధేశం కాదు. ప్ర‌శ్నించ‌డం మాత్ర‌మే ఈ ఆర్టిక‌ల్ ఉద్ధేశం.