మోడీ, కేసీఆర్ భేటీ వెనుక అసలు మర్మం ఇదేనా?

Thursday, June 14th, 2018, 03:00:24 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫ్రంట్ విషయమై పలు ప్రాంతీయ పార్టీల నేతలైన మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, దేవెగౌడ తదితరుల మద్దతు కోసం ఆయన వారితో భేటీలు కూడా నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు దేశ ప్రజలను దోచుకోవడమేకాక దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆయన మాట్లాడారు. అలానే కర్ణాటకలో ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి అక్కడి మీటింగ్లో పాల్గొన్న కేసీఆర్ మోడీపై పలు విమర్శలు సంధించారు. అయితే కేసీఆర్ ప్రస్తుతం తాను ఏర్పాటు చేయదలచిన ఫ్రంట్ ఏర్పాటు కోసమే అలా ప్రధానిపై పరుష వ్యాఖ్యలు చేస్తున్నారని అందరూ అనుకున్నారు.

ఆ విషయం అటుంచితే ఇటీవల కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి కేసీఆర్ వెళ్ళకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. తెలంగాణాలో తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ కు మద్దతు పలకకుండా ఉండేందుకు ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదనే విమర్శలు వినపడుతున్నాయి. అంతేకాక ఆయన అసలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి బీజేపీ ఒక కారణమని, బిజెపి నేతలే ఆయనతో ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ను ముందుకు నడిపినట్లు గుసగుఅసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ తాను ఏర్పాటు చేయదలచిన ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు అటు ఇటు అయితే తరువాత బిజెపితో కలవొచ్చని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అంతే కాదు ప్రస్తుతం ఆయన అందుకే బిజెపి పై మాటల దూకుడు తగ్గించారని, లోలోపల మాత్రం బీజేపీతో చెలిమి ఎప్పుడు ఉంటుందని అంటున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీని కలవాలని ఢిల్లీ కి వెళ్లిన ఆయనకు ప్రధాని అప్పాయింట్మెంట్ దొరకకపోవడంతో హోమ్ మంత్రిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై, నిధులపై పలు విధాలుగా చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే ఆ తరువాత ఇన్నాళ్లకు ఆయనకు అనుకోకుండా ప్రధాని అప్పాయింట్మెంట్ లభించడంతో వారిద్దరి భేటీ ప్రస్తుతం కొంత ఆసక్తిని సంతరించుకుంది. ఇకపోతే ఈ భేటీని ఇరు పార్టీలు నార్మల్ గా తీసుకున్నాయని, కేసీఆర్ ఈ భేటీలో రానున్న ఎన్నికల విషయమై తాము కేంద్రంలో బిజెపికి మద్దతిచ్చే అంశంపై కూడా మాట్లాడనున్నారని వార్తలు అందుతున్నాయి. రాజకీయం అంటే సమయానుకూలంగా, పరిస్థితులని బట్టి వ్యవహరించడమే అని, అది పూర్తిగా తెలిసిందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారని, అయితే కేంద్రంలో వారి మద్దతు ఎవరికుంటుంది అనే దానిపై ఇప్పుడే చెప్పలేమని, అది 2019 ఎన్నికలప్పుడే తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…..