గగన సీమలో ఘన నావిక్… భారత్ గెలుపు

Friday, April 13th, 2018, 07:12:25 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. దేశానికి సొంత జీపీఎస్‌ను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన నావిక్ వ్యవస్థలో భాగంగా ఐఎన్‌ఆర్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ41 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 19.19 నిమిషాల ప్రయాణం అనంతరం ఐఎన్‌ఆర్‌ఎస్‌ఎస్-1ఐ శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 1,425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం పదేండ్లపాటు సేవలు అందించనున్నది. పీఎస్‌ఎల్వీ-సీ41 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ కే శివన్ ప్రకటించారు. ఇందులో భాగస్వాములైన శాస్త్రవేత్తలందరినీ అభినందించారు. ఐఎన్‌ఆర్‌ఎస్‌ఎస్-1ఐ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ప్రయోగ ఫలితాలు సామాన్యులకు చేరాలని ఆకాంక్షించారు. ఇస్రోను చూస్తే గర్వంగా ఉన్నదంటూ ట్వీట్ చేశారు. 1ఐ తయారీలో ఇస్రోకు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ అనే సంస్థ సహకారం అందించింది. ఇస్రో ఓ ప్రైవేట్ కంపెనీ సహకారంతో తయారుచేసిన రెండో ఉపగ్రహం ఇది. గత ఆగస్టులో ప్రయోగించి విఫలమైన 1హెచ్ ఉపగ్రహాన్ని సైతం ప్రైవేట్ భాగస్వామ్యంతోనే రూపొందించారు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇప్పటివరకు 43 ప్రయోగాలు నిర్వహించగా ఇది 41వ విజయం.

త్వరలో నావిక్ యాప్‌లు: ఇస్రో చైర్మన్

ఐఎన్‌ఆర్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలన్నింటినీ అనుసంధానం చేసి నావిక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నట్టు ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఈ సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయని, ముఖ్యంగా మత్స్యకారులకు వినూత్న రీతిలో సేవలు అందించనున్నట్టు చెప్పారు. త్వరలో నావిక్ యాప్‌లను విడుదల చేస్తామన్నారు. వీటిని ప్రజలందరికీ చేరువ చేసేలా చర్యలు తీసుకోవాలని మొబైల్ పరిశ్రమతోపాటు ఇతర సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఐఎన్‌ఆర్‌ఎస్‌ఎస్-1ఐ మరో నెలరోజుల్లో తన పనిని ప్రారంభిస్తుందని, అప్పటివరకు కక్ష్యలో తిప్పుతూ, ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 14 రోజుల వ్యవధిలోనే రెండు ప్రయోగాలు నిర్వహించామని, ఇందుకు ఇస్రో కుటుంబంలోని శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారని చెప్పారు. వారందరినీ చూస్తే తనకు గర్వంగా ఉన్నదన్నారు. రెండు వారాల కిందట ఇస్రో జీఎస్‌ఎల్వీ ఎంకే-11 రాకెట్ ద్వారా జీఎస్‌ఏటీ-6ఏ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపగా ఆ ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments