ఆ ఇద్దరు టిడిపినేతల మధ్య ముదిరిన వివాదం?

Friday, April 13th, 2018, 03:34:15 PM IST

కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డలో ఆ ఇద్దరు టిడిపి నేతల మధ్య విబేధాలు ప్రస్తుతం తారాస్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాళ్ళు మరెవరో కాదు, మంత్రి భూమా అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి . ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే బాగుమంటోందని అంటున్నారు. అయితే మంత్రి అఖిలప్రియతో తనకు విబేధాలున్న మాట వాస్తవవమేనని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలోనే మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న విబేధాలను అప్పట్లో పార్టీ నాయకత్వం సర్దిచెప్పింది. దీంతో ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన భూమా బ్రహ్మనందరెడ్డి విజయం కోసం ఏవీ సుబ్బారెడ్డి తనవంతు కృషి చేశారు. అయితే ఏవీ సుబ్బారెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఒకప్పుడు ప్రధాన అనుచరుడుగా ఉండేవాడు. భూమా నాగిరెడ్డి ఏడాదిన్నర క్రితం మరణించారు.

అయితే ఇటీవల జరిగిన ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి భూమా కుటుంబసభ్యులు ఏవీ సుబ్బారెడ్డిని ఆహ్వనించలేదు. ఆ వర్ధంతి సభలోనే పరోక్షంగా ఏవీపై మంత్రి అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆళ్ళగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి విడిగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎవరూ కూడ వెళ్ళకూడదని మంత్రి అఖిలప్రియి ఇచ్చిన ఆదేశాలను కొందరు పార్టీ నేతలు ధిక్కరించడంతో వీరిమధ్య విబేధాలు ముదిరిపాకానపడ్డాయి. ఆళ్ళగడ్డను తాను వదిలే ప్రసక్తే లేదని ఏవీ సుబ్బారెడ్డి తాజాగా స్పష్టం చేశారు. కన్నతల్లిని, పుట్టిన ఊరును తాను వదలబోనని ప్రకటించారు. తాను కూడ ఆళ్ళగడ్డలోనే పుట్టానని ఆయన తేల్చి చెప్పారు. ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి జెండాను ఎగురవేస్తానని ఆయన చెప్పారు. ఇందుకోసం తాను నియోజకవర్గంలో జోక్యం చేసుకొనితీరుతానని ఆయన తేల్చి చెప్పారు.

అలానే ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని, పార్టీ కోసమే తాను పని చేస్తున్నానని ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పార్టీ కోసం ఆళ్ళగడ్డలో ఖచ్చితంగా అడుగుపెడతానని సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. అయితే తనను ఉద్దేశ్యపూర్వకంగానే మంత్రి అఖిల ప్రియ పక్కన పెట్టారనే అభిప్రాయంతో ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తాను ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. పార్టీలో తనకు న్యాయం జరుగుందనే నమ్మకం ఉందన్నారు. మంత్రి అఖిలప్రియ కోసం తాను పనిచేయడం లేదన్నారు. పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. అయితే పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని కూడ ఆయన ప్రకటించారు….