హెచ్‌-1బి వీసాలు, గ్రీన్‌కార్డుల జారీలపై అమెరికాలో ఉద్యమం

Wednesday, March 21st, 2018, 01:06:45 PM IST

తాజాగా అమెరికాలో హెచ్‌-1బి వీసాలు, గ్రీన్‌కార్డుల జారీలపై వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి వర్క్‌ వీసాల దరఖాస్తులు ప్రారంభంకానున్న నేపథ్యంలో హెచ్‌-1బి వీసాలపై చేస్తున్న దుర్వినియోగాన్ని అడ్డుకోవాలంటూ ప్రోగ్రసివ్స్‌ ఫర్‌ ఇమ్మిగ్రేషన్‌ రిఫామ్‌ అనే అమెరికా సంస్థ గట్టి ప్రచారాన్ని మొదలు పెట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కో మెట్రో రైల్వే స్టేషన్లలో ఈ అంశానికి సంబంధించి వాల్ పోస్టర్లు అతికించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి, వారి స్థానంలో చౌకగా లభించే విదేశీ నిపుణులను దేశానికి తీసుకొచ్చేందుకు హెచ్‌-1బి ప్రోగ్రామింగ్‌ను కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయని ఆ సంస్థ ఆరోపనలు వ్యక్తం చేసింది. కేవలం డిగ్రీ పూర్తయిన వారినే తీసుకొస్తున్నారనీ, వచ్చిన వారికీ ఉద్యోగభద్రత ఉండదంటూ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. అమెరికన్లనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, ఆ మేరకు హెచ్‌1బి వీసా నిబంధనలను కఠినతరం చేయాలని ఆ సంస్థ డిమాండ్‌ చేస్తోంది.

శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా భారతీయ వృత్తినిపుణులు అమెరికాలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందల మంది పాల్గొన్న ఈ ప్రదర్శనలు శాంతియుతంగా కొనసాగాయి. ఒక్కో దేశానికి ఏడాదికి ఏడు శాతం చొప్పున కోటా నిర్ణయించి ఆ మేరకే గ్రీన్‌కార్డులను లాటరీపద్ధతిలో జారీ చేయటం వల్ల అధిక సంఖ్యలో ఉన్న భారతీయ నిపుణులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మమ్మల్ని, మా తెలివితేటలను వాడుకొని ఇప్పుడు మాకు గ్రీన్ కార్డు ఇవ్వడానికి ఇలా జాప్యం చేయడం ఏమీ బాగోలేదని అక్కడి భారతీయులు వాపోతున్నారు. ఈ నిబంధనల వల్ల ప్రస్తుతమున్న తమ నిరీక్షణ జాబితా పూర్తి కావటానికి 70ఏళ్ల సమయం పడుతుందని హెచ్‌-1బి వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భారతీయ నిపుణుల ఉద్యమానికి అమెరికన్‌ చట్టసభల సభ్యుల నుంచీ మద్దతు లభిస్తోందని ఇటీవలే ఏర్పడిన భారతీయ-అమెరికన్ల సంస్థ ‘జీసీరిఫామ్స్‌’ పేర్కొంది. అమెరికా ఆర్థికాభివృద్ధికి శ్రమిస్తున్న 3లక్షల మంది భారతీయ వృత్తి నిపుణుల పట్ల వివక్ష చూపేలా ఉన్న ఈ కోటా విధానాన్ని రద్దు చేయాలని అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు ఆందోళనను విస్తరింపజేయనున్నట్లు సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. అర్కన్సాస్‌, కెంటుకీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌, నెబ్రస్కా, ఒరెగాన్‌లోని హిల్స్‌బొరో తదితర ప్రాంతాల్లో అమెరికన్లూ తమకు మద్దతుగా ప్రదర్శనల్లో మాట్లాడారని జీసీ రిఫామ్స్‌ వెల్లడించింది. ఇక ఈ ఉద్యమం ఎంతవరకు దారి తీస్తుందో అని భయాందోళనతో అక్కడికి వెళ్లాలని నిర్ణయం తీస్కున్న ప్రస్తుత భారతీయులు ఆవేదనలో ఉన్నట్టు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments