ఏపీ బిజెపిలో ముసలం?

Monday, May 14th, 2018, 02:53:34 PM IST

ప్రస్తుతం ఏపీ బీజేపిలో ఎన్నడూ లేనంత సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే, నిన్న ఏపీ బిజెపి అధ్యక్షుడిగా గుంటూరు నేత కన్నా లక్ష్మీనారాయణను అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై సోము వీర్రాజు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించిన వీర్రాజు వర్గం కన్నా ఎంపిక సరైనది కాదంటోంది. గత కొద్దీ రోజులుగా పార్టీలో, పార్టీ కార్యక్రమాల్లో చొరవ చూపని కన్నాకు ఆ పదవి ఎలా కేటాయిస్తారని, అందునా ఆయన బిజెపిని వీడి వేరొక పార్టీలో చేరేందుకు సమాలోచనలు జరిపారని, అటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నాళ్ళనుండో పార్టీకి తనవంతుగా సేవ చేస్తున్న సోము వీర్రాజును కాదని కన్నాకు పదవి కేటాయించారని వారు మండిపడుతున్నారు. అంతేకాదు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ప్రాంతాల్లోని పలువురు బిజెపి నేతలు ఆయన ఎంపికపై సుముఖంగా లేరని, రేపో మాపో ఆ ప్రాంతాల నేతలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. పార్టీకి చెందిన సీనియర్లను పక్కనపెట్టి, నిన్న కాక మొన్న వచ్చిన నేతలకు అధిష్టానం పదవి ఇచ్చిందని మరికొందరు నేతలు బహిరంగంగానే ఆయన ఎంపికను తప్పుపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఆ పార్టీ నేత సోము వీర్రాజు అలకపూని అజ్ఞాతంలో వున్నారని, పార్టీలో సేవచేసేవారికి గుర్తింపులేదనే భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం…..