ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు చిక్కిన సొర‌చేప‌!?

Saturday, October 6th, 2018, 01:23:10 AM IST

మోదీ ఆప‌రేష‌న్‌-ఎక్స్ స్పీడందుకుంది. తెలంగాణ‌, ఏపీలో రాజ్యాధికారం ఛేజిక్కించుకోవ‌డమే ధ్యేయంగా పావులు కదుపుతున్న మోదీ ప్ర‌భుత్వం ఐటీ దాడుల్ని ముమ్మ‌రం చేసింది. అవినీతి సొర‌చేప‌ల్ని ఏరేస్తాన‌ని ప్ర‌క‌టించిన న‌రేంద్ర మోదీ.. ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. బాగా తిని బ‌లిసిన సొర‌చేప‌ల్ని వేటాడ‌డం ఆయ‌న ప్ర‌ధానిగా ప‌ద‌విలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి మొద‌లైంది. అవినీతిప‌రులు- అక్ర‌మార్జ‌న‌లు చేసిన వారిని వేటాడ‌తాన‌ని ఆయ‌న ముందే ప్ర‌క‌టించి మ‌రీ గెలిచిన సంగ‌తి విధిత‌మే. అయితే ఈ విష‌యంలో తెలుగు రాష్ట్రాల్లో కాస్త నెమ్మ‌దిగానే ఉంది వ్య‌వ‌హారం. ఇటీవ‌లి కాలంలో ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం భాజ‌పాకు వ్య‌తిరేకంగా వెళ్ల‌డంతో ఇక ప్ర‌త్య‌ర్థి తోలు వొల‌వ‌డ‌మే ధ్యేయంగా మోదీ పావులు కదుపుతున్నారు. ఆ క్ర‌మంలోనే ఏపీ, తెలంగాణ‌లో అధికార ప‌క్షాల‌కు ప‌క్కా శ‌త్రువులు ఎవ‌రు ఉన్నారో వాళ్ల‌తో ఒక జాబితాను, ఆస్తుల చిట్టాను తెప్పించుకుని మ‌రీ ఆప‌రేష‌న్ షురూ చేశార‌ని తెలుస్తోంది.

ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగానే తెలంగాణ‌లో ఇటీవ‌ల రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు నిర్వ‌హించార‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు ఏపీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు కుడిభుజం అయిన మంత్రి నారాయ‌ణ‌పైనా ఐటీ దాడులు సాగుతున్నాయ‌ని ఓ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. దీనిపై అధికారికంగా ఎలాంటి క్లూ లేక‌పోయినా.. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌పై శుక్ర‌వారం ఉద‌యం నుంచి ఐటీ దాడులు నిర్వ‌హించార‌న్న వార్త ఒక‌టి ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ దాడుల‌కు విజ‌య‌వాడ‌, గుంటూరు నుంచి కొంద‌రు ఐటీ అధికారులు విచ్చేశార‌ని, వీళ్ల‌కు పోలీసులు ఎస్కార్టులుగా ఉన్నార‌ని చెబుతున్నారు. అంతేకాదు అమ‌రావ‌తి కేంద్రంగా భూ దందాలు న‌డిపించి, లేదా వ్యాపారాలు చేసి ఐటీ క‌ట్ట‌ని వారిపైనా ఐటీ అధికారులు క‌న్నేశార‌ట‌. అందులో ప‌లువురు అధికార పార్టీ ప్ర‌తినిధులు ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ దాడులకు కార‌ణ‌మేంటి? అంటే .. చంద్ర‌బాబు ఆర్థిక మూలాలు ఎక్క‌డెక్క‌డున్నాయో వాట‌న్నిటినీ నిర్వీర్యం చేయ‌డం ద్వారా రాష్ట్రంలో భాజ‌పా గెల‌వాల‌న్న‌ వ్యూహ‌మేన‌న్న మాటా వినిపిస్తోంది. ఏ రాజ్యంపై దండెత్తినా అక్క‌డ ఆర్థిక మూలాల్ని నాశ‌నం చేయ‌గ‌లిగితే గెలుపు ఆటోమెటిగ్గా త‌థ్యం అవుతుంద‌న్న సూత్రాన్ని తూ.చ త‌ప్ప‌క మోదీ ఆచ‌రిస్తున్నార‌ని విశ్లేషిస్తున్నారు. ఈ గేమ్‌లో నెక్ట్స్ అతి పెద్ద సొర‌చేపలు ఏవో త‌ర్వాతి ఆర్టిక‌ల్‌లో తెలుసుకోవ‌చ్చు.. టిల్ దెన్ వెయిట్ & రీడ్ హియ‌ర్‌..