చోటాభీమ్ తో బడా భీమ్…హైదరాబాద్ లో అతిపెద్ద యానిమేషన్ టవర్

Tuesday, May 8th, 2018, 09:15:32 AM IST

యానిమేషన్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం 16 లక్షల చదరపు అడుగుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇమేజ్ టవర్స్‌ను నిర్మిస్తున్నామని, ఈ రంగానికి భవిష్యత్‌లో హైదరాబాద్ కేంద్రంగా మారనున్నదని ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు. భారతీయ యానిమేషన్‌రంగంలో సంచలనం సృష్టించిన చోటాభీమ్ పది వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నోవాటెల్‌లో ఏర్పాటుచేసిన దశాబ్ది వేడుకల్లో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. నేను చోటాభీమ్‌కు అభిమానిని. అందులోని పాత్రలన్నీ నాకు బాగానచ్చాయి అన్నారు. గ్రీన్‌గోల్డ్ యానిమేషన్ సృష్టించిన చోటాభీమ్ ప్రోగ్రామ్ పిల్లలనే కాకుండా కుటుంబం మొత్తాన్ని అలరించిందని చెప్పారు. టీవీ, సినిమాలు, ఇంటర్నెట్, యూట్యూబ్‌లో పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో అని ఆందోళన చెందే తల్లిదండ్రులు సైతం చోటాభీమ్ కార్యక్రమం విషయంలో స్వేచ్ఛను ఇవ్వగలిగారని తెలిపారు. ఇండియన్ నమూనాలో డిస్నీల్యాండ్ తరహా యానిమేషన్ ప్రపంచాన్ని రూపొందించాలని ఆకాక్షించారు.

చోటాభీమ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గ్రీన్‌గోల్డ్ హైదరాబాద్ స్టార్టప్‌గా ఆ దిశగా కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తంచేశారు. ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలను ధరించేలా చూడాలని గ్రీన్‌గోల్డ్ సంస్థను కోరారు. తద్వారా ఆ రంగంలో పనిచేసే వారికి మేలు జరుగుతుందని సూచించారు. గ్రీన్‌గ్రోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రాజీవ్ చిలక మాట్లాడుతూ 2008లో పోగో టీవీ ద్వారా తొలిసారి చోటా భీమ్ ప్రసారమైందని, ఈ పదేండ్లలో దేశ విదేశాల్లో ఎంతో ఆదరణ లభించిందని అన్నారు. ఇప్పటివరకు 16 వేల నిమిషాల కంటెంట్‌ని ప్రేక్షకులకు ఇవ్వగలిగామని తెలిపారు. దేశంలోని కోట్లాది చిన్నారులను మెప్పించేలా చోటా భీమ్ ఎపిసోడ్స్‌ని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. చోటా భీమ్ ఒక బ్రాండ్‌గా పలు ఇతర ఉత్పత్తుల సృష్టికి దారితీసిందన్నారు. త్వరలో నెట్‌ఫ్లిక్స్ ద్వారా మైటీ లిటిల్ భీమ్ సిరీస్‌ని ప్రసారం చేయనున్నామని, తద్వారా 190 దేశాల్లో ప్రేక్షకులకు చోటాభీమ్ చేరువకానున్నాడని తెలిపారు. రాబోయే సిరీస్ కుంగ్‌ఫూ దమాకాలో చోటాభీమ్ ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం కానున్నాడన్నారు. ఈ సందర్భంగా చోటా భీమ్ ఆటపాటలతో అలరించాడు. కార్యక్రమంలో గ్రీన్‌గోల్డ్ ప్రతినిధులు శ్రీనివాస్, సమీర్ పాల్గొన్నారు.

Comments