గాలి కూతురి పెళ్లి దాడులకు దారి తీసింది !

Monday, November 21st, 2016, 08:01:59 PM IST

gali-janardhan
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మరోసారి వార్తల్లో నానుతున్నారు. అక్రమ మైనింగ్ కేసులో జైలు జీవితం గడిపిన ఆయన 2015 లో బెయిల్ పై విడుదలై కొన్నాళ్ళు పెద్దగా ఎక్కడా పేరు వినిపించకుండా జాగ్రత్తపడ్డారు. కానీ తాజాగా కుమార్తె పెళ్లిని భారీ మొత్తం ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా చేసి మరోసారి వార్తల్లో నిలిచి ప్రభుత్వ అధికారుల కంట్లో పడ్డారు. సినీ,రాజకీయ రంగ ప్రముఖులు బోలెడంత మంది హాజరైన ఈ పెళ్ళికి రూ.500 కోట్లు ఖర్చయింది. ఈ లెక్కలతో సామాన్యులతో పాటు అధికారులు సైతం గుండెలు పట్టుకున్నారు.

ఈ విషయంపై మీడియా గాలిని ప్రశ్నించగా వెళ్లి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోండి అంటూ గాలి సమాధానం చెప్పారు. దీంతో సామాజిక కార్యకర్త నరసింహ మూర్తి ఆదాయపన్ను జనరల్ కు గాలికి అంత డబ్బు ఎలా వచ్చింది. సామాన్యులు 100, కొత్త 2000 నోట్లు దొరక్క ఇబ్బంది పడుతుంటే అంత పెద్ద మొత్తం ఎలా ఖర్చు పెట్టగలిగారో కనుక్కోవాలని పిర్యాదు చేశారు. దీంతో ఐటీ శాఖ సోమవారం ఒబులాపురం మైనింగ్ కంపెనీపై దాడులు నిర్వహించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.