రోజా సినిమాలు, సీరియళ్లు చేసుకుంటే మంచిది : టీడీపీ మంత్రి

Wednesday, May 9th, 2018, 04:00:38 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసిపిల మహద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది ప్రస్తుత పరిస్థితి. నిన్న వైసిపి నేత, నగరి ఎమ్యెల్యే రోజా చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. అసలు రోజా ఏమి మాట్లాడుతోందో అర్ధమవుతుందా అన్నారు. ఆమె చంద్రబాబు పై చేస్తున్న అభియోగాలు సరైనవి కావని అన్నారు. ఏకంగా సెంట్రల్ లోనే అతిపెద్ద నేర పరిశోధక సంస్థ అయిన సిబిఐ ని వైసిపి నేతలు తప్పుపడడం వారి అవివేకం అన్నారు. తమకు సీబీఐ అంటే నమ్మకం లేదన్నవారు, ప్రస్తుతం చంద్రబాబు పై సీబీఐ నివేదిక వేయాలి అని ఎలా డిమాండ్ చేస్తారు అని ప్రశ్నించారు. అసలు మీకు ముందు సీబీఐ మీద నమ్మకం ఉందా, లేదా అనేవిషయమై స్పష్టత ఇవ్వాలన్నారు.

రోజాకి తండ్రి సమానులైన చంద్రబాబు పై ఇంత నీచమైన కుట్రపూరిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రాజకీయాల్లో జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు నడవవని, మనం ఒక మాట మాట్లాడేముందు దానికి కట్టుబడి ఉండాలన్నారు. ప్రజలకోసం చంద్రబాబు ఎంత పోరాడుతున్నారో అందరికి తెలుసని, ఇకనైనా ఆయనపై దుష్ప్రచారం చేయడం ఆపాలని అన్నారు. జగన్ సహా ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, జగన్ త్వరలోనే జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. ఆ పార్టీ నేత రోజా రాజకీయాలు వదిలి చక్కగా సినిమాలు, సీరియళ్లు చేసుకుంటే డబ్బుకి డబ్బు, మంచిపేరు వస్తుందని హితవు పలికారు……