ఇక అతనితో రాజీ కష్టమే : షమీ భార్య హసీన్

Monday, March 12th, 2018, 04:00:13 PM IST

గత కొద్దిరోజులుగా భారత ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమిపై అతడి భార్య హసీన్‌ జహాన్‌ విమర్శలను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ప్రస్తుతం దాడిని మరింత పెంచింది. తన భర్తతో సర్దుకుపోవడానికి ఎంతో ప్రయత్నించానని కానీ అతడి తీరుతో విసిగిపోయాకే బయటికి వచ్చి మాట్లాడాల్సి వచ్చిందని ఆమె అన్నారు. షమి మొబైల్‌ తనకు దొరికి అతడి చీకటి వ్యవహారాలకు సంబంధించి సాక్ష్యాలు సేకరించడం వల్లే ఇప్పుడు తానిలా మాట్లాడగలుగుతున్నానని, లేదంటే తన పరిస్థితి దయనీయంగా ఉండేదని హసీన్‌ అన్నారు. షమిలో పశ్చాత్తాప భావమే లేదు. వివిధ దేశాల్లోని అనేకమంది మహిళలతో తన సంబంధాలు కొనసాగించాడు.

నిజానికి షమి మొబైల్‌ నా చేతికి చిక్కకపోయి ఉంటే అతను ఉత్తర్‌ప్రదేశ్‌కు పారిపోయేవాడు. నా నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసేవాడు అని కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో హసీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. షమితో రాజీ చేసుకునే స్థాయి ఎప్పుడో దాటిపోయిందని వాపోయారు. నా భర్తతో సర్దుకుపోవడానికి నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. నా లాయర్‌ సహాయకురాలు డోలా కూడా షమికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మేం ఆశించింది ఏది జరగలేదు. ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ దశలో రాజీ కష్టం. ఏదైనా నా లాయర్‌ సలహా మేరకే నడుచుకుంటా అని అన్నారు. షమి కుటుంబ సభ్యులు నలుగురు కోల్‌కతాకు చేరుకుని హసీన్‌తో మాట్లాడే ప్రయత్నం చేయగా, ఆమె అందుబాటులోకి రాలేదని తెలిసింది.

తన కుమార్తె ఒక పేరుమోసిన క్రికెటర్‌తో న్యాయ పోరాటం చేస్తున్నందున ఆమెకు పోలీసు రక్షణ పెంచాలని హసీన్‌ తండ్రి పోలీస్ లను కోరుతున్నారు. రాజీ మార్గంలో చర్చల ద్వారా తన భార్యతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు క్రికెటర్ షమి చెప్పాడు. ఇలాంటి వ్యవహారంలో మాట్లాడుకుని పరిష్కరించుకోవడం కంటే మంచి మార్గం మరొకటి ఉండదు. ఆమె ఎప్పుడు కోరుకుంటే నేను అప్పుడు మాట్లాడతాను. నాపై ఆరోపణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నేను వాటి విషయంలో వివరణ ఇవ్వదలుచుకోలేదు. వాటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి అని షమి ఈ సందర్భంగా తెలియజేశారు…