పాక్ పై యుద్ధం చేయాల్సింది భారతీయులు కాదు.. పాకిస్థానీలే !

Sunday, September 25th, 2016, 01:51:32 PM IST

MODI
దేశ ప్రజలంతా ఒకే విషయంపై రగిలిపోతున్నారు. అదే సైన్యం పై ఉగ్రదాడి. చనిపోయిన జవాన్ల శవాలను, వారి కుటుంబ సభ్యుల ఆవేదనను, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ పిడికిళ్లు బిగబట్టి ఈ పాకిస్థాన్ని… అంటూ పళ్ళు కోరుకుతున్నారు. మోదీ గనుక ధైర్యం చేసి ఒక్క మాట చెబితేనే ఇక చూస్కోండి అంటూ తుపాకులు ఎక్కుపెడుతున్నారు ఆర్మీ అధికారులు. ఇంతటి సున్నితమైన సందర్భంలో మోదీ మొదటిసారి కేరళలోని కోజికోడిలో బహిరంగ సభలో మాట్లాడారు. మాట్లాడతామంటే అలా ఇలా కాదు ఆచి తూచి ముందు చూపుతో వ్యవహరించారు.

ఆయన మాటలు వింటే ప్రతి ఒక్కరు ఒక ఆలోచనలో పడకుండా ఉండలేరు. ముందుగా సైన్యంపై ఉగ్రదాడిని నిరసిస్తూ, దానికి పాకిస్థాన్ నే ప్రధాన కారణంగా చూపుతూ ప్రసంగం మొదలుపెట్టిన మోదీ ‘ సైన్యంపై ఈ ఉగ్రదాడిని భారత ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రసన్న త్యాగం చేసిన సైనికుల త్యాగం వృధా పోదు. ఈ దాడికి పాకిస్థాన్ సమాధానం చెప్పి తీరాల్సిందే. మీకు యుద్ధమే కావాలంటే మేము ఇప్పటికీ సిద్దమే’ అంటూ ప్రజల్లో, సైన్యంలో ఉన్న ఆవేశాన్ని ఇంకాస్త రగిలించారు. ఇవే ఈ మాటలే మాకు కావాల్సింది. ఒక నాయకుడికి ఈ ఆవేశమే ఉండాల్సింది అని అందరూ అనుకునేలా చేశారు. ఒక్క ప్రజలే కాదు ఇతర సంఘ సంస్కర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు కూడా మోదీ తీసుకోబోతున్నాడని అనుకున్నారు.

కానీ ఇంతలోనే మోదీ కాస్త వ్యవహారం మార్చి చాకచక్యంగా జాతి అభివృద్ధి దిశగా వెళ్లిపోయారు. ఆయనతో పాటు అందరినీ తీసుకెళ్లారు. ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఇప్పటికీ చక్కదిద్దుకోలేదు. మునుపు బంగ్లాదేశ్ ను పోగొట్టుకుంది. గిల్గిట్, సింధ్, బాల్టిస్థాన్ దేన్నీ బాగు చేసుకోలేకపోయింది. కానీ వారితో పాటే స్వాతంత్య్రం పొందిన భారత్ మాత్రం అగ్రగామిగా ప్రపంచ దేశాల ముందు గౌరవం పొందుతోంది. స్వేచ్ఛ పొందినప్పటి నుండి భారత సాఫ్ట్ వేర్లను విదేశాలకు ఎగుమతి చేస్తుంటే, పాక్ మాత్రం ఉగ్రవాదులను సప్లై చేస్తోంది. వీళ్లా కాశ్మీర్ ని బాగుచేసేది. పాక్ ప్రజలు కూడా తాము ఎలాంటి దుస్థితిలో ఉన్నామో ఆలోచించాలి. అందుకు కారణమైన నాయకుల్ని నిలదీయాలి. పాక్ పూర్వీకులంతా భారత్ నే తన మాతృ దేశంగా భావించి పూజించారు. అది మర్చిపోవద్దు. మీకు అంట శక్తి ఉంటే పేదరికం,నిరక్షరాస్యత, నిరుద్యోగం, సుసు మరణాలు, పౌష్టికాహార లోపం వంటి సమస్యలపై పోరాడండి. ఎవరు ముందుగా వాటిని గెలుస్తారో చూద్దాం. భారతీయులు కూడా ఈ యుద్దానికి సిద్ధంగా ఉండాలి’ అంటూ యుద్ధం గురించి ఆలోచిస్తున్న భారతీయుల్ని అభివృద్ధితోనే గెలుపు పొందాలి కదా అనే ఆలోచనలోకి తీసుకెళ్లారు. పాకిస్థాన్ ప్రజల్ని మాత్రం మీ బ్రతుకుల్ని బాగుచేసుకోండి అంటూ తమ పాలకుపైనే తిరగబడేలా ప్రేరేపించారు. మొత్తం మీద తన నైపుణ్యంతో యుద్ధం చేయాల్సింది భారతీయులు కాదు పాకిస్థానీలే, భారతీయులు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి అని భోదించారు. ఒక సంఘటన ద్వారా ప్రజల్లో పుట్టిన ఆవేశాన్ని నీరు గార్చకుండా అవసరమైన చోట ఎలా ఉపయోగించాలో మోదీకి తెలుసు. ఎందుకంటే ఆవేశం ఎలా పుట్టినా దానికి చరిత్రను మార్చగల శక్తి ఉంది గనుక. ఆ శక్తి ఆయనకు తెలుసు గనుక.