థర్డ్ ఫ్రంట్ కాదు అప్పుడు మొదటి ఫ్రంటే : కేసీఆర్

Monday, March 12th, 2018, 09:26:39 AM IST


సాధారణ ఎన్నికలకు గడువు సమీపించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో తమ అధికారాన్ని కాపాడుకునే దిశగా టిడిపి పావులు కదుపుతుంటే, మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా తనదైన వ్యూహరచనతో ముందుకు దూసుకెళుతున్నారు ఆదివారం టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వివిధ అంశాలపై జరిగిన చర్చపై ఆయన మాట్లాడుతూ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం స్పష్టమైన గ్యాప్ ఉందన్నారు. తాను కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి చేరతానని, గుణాత్మకమైన రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

రాష్ట్రంలో ఉంటూనే జాతీయ స్థాయిలో పని చేస్తానన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం తప్పుకాదని ఆయన సమర్థించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2014 సాధారణ ఎన్నికల వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బిజెపి తరఫున దేశమంతా తిరిగినట్లు తాను కూడా అన్ని రాష్ట్రాలను చుట్టి వస్తాను అన్నారు. కేంద్రం లో బిజెపి, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు, పలు జాతీయ పార్టీలు ఏకం చేస్తానని ఆయన అన్నారు. తదనంతరం ఏర్పడేది థర్డ్ ఫ్రంట్ కాదని, అదే మొదటి ఫ్రెంట్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం కొంతవరకూ ఉందని, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదని ఆయన గట్టిగా అంటున్నారు.

ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాల పేర్లు వినబడతాయేతప్ప ఆ పథకాల అమలు ఉండదు అన్నారు. కాంగ్రెస్, బిజెపి రెండూ దొంగలే అన్నట్లుగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారం టీఆర్ఎస్ దేనని, ఈసారి కూడా సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇస్తామని, ఎవరూ అభద్రతాభావానికి గురికావద్దని అన్నారు. తాము ఇప్పటి వరకు చేసిన 2 సర్వేల ప్రకారం ఒక సర్వేలో 103 స్థానాలు, మరొక సర్వేలో 106 స్థానాలు టిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. అయితే అక్కడక్కడా ఉన్న కార్యకర్తలు, నేతల లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళతామన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ దూకుడు చూసి కాంగ్రెస్ నేతల మొఖాలు కళ తప్పాయి అని ఆయన ఎద్దేవా చేశారు.

ఈసారి అసెంబ్లీ మండలి బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నడపటానికి సిద్ధమన్నారు. కాంగ్రెస్ సభ సభ్యులు సభను అడ్డుకోవాలని చూస్తున్నారని, సభలో ఉంటే వారి పరువు పోతుందని భావించి వారు సస్పెండ్ కావాలనుకుంటున్నారు ఆయన అన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం ఆ గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి చేసే ప్రసంగం సమయంలో ఆయన చదివే పేపర్లను చించి విసిరి పారేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకున్నట్టు తెలిసిందన్నారు. ఒకవేళ వాళ్ళలా చేస్తే అటు వైపు ఎవరూ వెళ్ళవద్దు. ఎటువంటి డిస్టర్బన్స్ చేసినా పట్టించుకోవద్దు, వారిపై బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. లోగడ మహారాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ పై దాడికి యత్నించిన ఎమ్యెల్యే లపై మూడేళ్ళ పాటు నిషేధం విధించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.

మా పార్టీలో మాదిరిగానే కాంగ్రెస్ లో కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారు అన్నారు. అందులో ముఖ్యులు జానారెడ్డి గారు అని అన్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో ఎస్సీ వర్గీకరణ, మైనారిటీ రిజర్వేషన్ల పెంపు సాధించుకుంటామని ఆయన అన్నారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దాం అన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను సీఎం కేసీఆర్ వివరించారు. యాదవులకు ఒక సీటు ఇస్తానని చెప్పి ఇచ్చానన్నారు. ఇదివరకు ముదిరాజు నుండి అవకాశాలు రాలేదని అందుకే ఆ వర్గానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చానని తెలిపారు.కావున రానున్న ఎన్నికలపై ప్రతిఒక్క కార్యకర్త దృష్టిపెట్టి ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లి తమ బాధ్యతలు నెరవేర్చాలి అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments