కేటిఆర్ మాట వింటారో లేకుంటే కేసీఆర్ పై తిరుగుబాటు చేస్తారో !

Sunday, September 23rd, 2018, 12:18:14 PM IST

ముందస్తు ఎన్నికలకు కాలు దువ్వి 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఆసక్తి రేపిన కేసిఆర్ సొంత పార్టీ నేతల ఆగ్రహానికి కూడ గురయ్యారు. తొలిదశ జాబితాలో టికెట్ దక్కక భంగపడిన వారంతా కొన్ని రోజుల నుండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. తమ అ అలకతోనైనా అధినేత మనసు మార్చుకుని దారికి వస్తారని ఆశించారు వారంతా.

కానీ అలా జరిగితే అక్కడుండేది కేసీఆర్ ఎలా అవుతాడు. అందుకే ఆయన తాను ప్రకటించిన 105 మంది జాబితాలో ఎలాంటి మార్పు ఉండదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అభ్యర్థులను నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేయమని పురమాయించేశారు. దీంతో టికెట్టు దక్కని వారికి అన్ని దార్లు మూసుకుపోయినట్టైంది. సిట్టింగుల్లో 83 మందికి టికెట్లిచ్చిన కేసీఆర్ బాబు మోహన్, నల్లాల ఓదెలుల అభ్యర్థిత్వాలను మొదట్లోనే నిరాకరించగా ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్న సి.కనకారెడ్డి, కొండా సురేఖ, బొడిగె శోభ, బి.సంజీవరావు, ఎం. సుధీర్ రెడ్డిలకు అవకాశం కష్టమనే విషయం అర్థమైపోయింది.

వారితో పాటు గతంలో పదవులు ఆశించి పార్టీలోకి దూకిన ఇతర పార్టీ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు టికెట్లు దక్కక నిరుత్సాహంతో ఉన్నారు. వీరందరినీ బుజ్జగించే పనిని కేటిఆర్ భుజాలపై పెట్టారు కేసిఆర్. కేటిఆర్ ఒకొక్క అసంతృప్త నేతని కలుస్తూ, భవిష్యత్తులో పదవులు ఉంటాయనో, ఈసారికి ఇలాకానివ్వండనో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి తీవ్రంగా ప్రతిఘటించిన నల్లాల ఓదెలు వంటి వారు కేటిఆర్ మాటలతో సైలెంట్ అవుతారో లేకపోతే పార్టీ మారి, స్వతంత్రులుగా నిలబడి కేసీఆర్ పై తిరుగుబాటు చేస్తారో చూడాలి.