జ‌గ‌న్ అనే నేను.. మ‌రో హామీ ఇస్తున్నా.. యూట‌ర్న్ తీసుకోను..!

Monday, February 11th, 2019, 04:58:50 PM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా అనంత‌పురం జిల్లాలో నిర్వ‌హించిన అన్న పిలుపు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని తటస్థుల నుంచి రాష్ట్రాభివృద్ధికి, వివిధ అంశాలపై సలహాలు సూచనలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో జగన్ మాట్లాడుతూ… తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.

ఇక రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపరుస్తామన్నారు. తర్వాత తనతో సహా ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకుంటామని, అలా అయితేనే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఇక, ఉద్యోగాల సమస్య పరిష్కరించేందుకు ప్రైవేటు సంస్థల్లో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి శాసనసభలోనే చట్టం చేస్తామన్నారు. స్థానిక నిరుద్యోగులకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రతీ జిల్లాకు రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

అలాగే మ‌రోవైపు స‌మ‌ర శంకారావంలో పాల్గొన్న జ‌గన్ చంద్ర‌బాబు తాజాగా చేస్తున్న దీక్ష పై స్పందించారు. చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి ఇవాళ ప్రత్యేక హోదా అనే పదం మళ్లీ వచ్చింది అంటే దానికి వైసీపీ చేసిన పోరాట‌మే కార‌ణ‌మ‌ని జగన్ పేర్కొన్నారు. నాడు అసెంబ్లీలో ఇదే చంద్రబాబు ప్రత్యేక హోదాను ఖూనీ చేస్తూ మాట్లాడారని, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా అడిగిన వారికి జైళ్లలో వేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలు వచ్చేసరికి యూటర్న్ తీసుకుని.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి నల్లచొక్కా వేసుకొని దీక్ష చేస్తే న‌మ్మేవారు ఎవ‌రూలేర‌ని, ఎన్నికలకు మూడు నెలల ముందు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త పథకాలు తీసుకువస్తున్నారని ఆరోపించారు.