చంద్రబాబు గారికి తెలుగు జాతి చెప్పిందా : జగన్

Wednesday, March 21st, 2018, 03:58:08 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ.. తెలుగు జాతి ఆయనకు ఏం చెప్పింది అనే కోణంలో సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. ‘నేను బలహీనపడితే.. ఆంధ్రప్రదేశ్‌ బలహీనపడుతుంది.. ప్రజలకు నష్టం జరుగుతుంది’ అంటూ చంద్రబాబుగారు తెగ బాధపడిపోయినట్లు పత్రికల్లో వచ్చిన వార్త చూడగానే చాలా విడ్డూరం అనిపించింది. నిజమే.. ఓటుకు కోట్లు లాంటి అనేక అవినీతి కేసులతో ఆయన బలహీనపడ్డారు.

ఆయనగారు కేసుల్లో ఇరుక్కుని తన ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టడంతో నిజంగా రాష్ట్రమూ బలహీనపడింది. తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దగ్గర అడ్డంగా దొరికిపోయి.. బయట పడటం కోసం సాగర్‌ జలాలు మొదలుకుని.. ప్రత్యేక హోదా వరకూ రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ తాకట్టుపెట్టారు. బాబుగారి పాపాలు ప్రజలకు శాపాలుగా మారుతుంటే రాష్ట్రం బలహీనపడక మరేమవుతుంది? ఆయన చేసిన తప్పుడు పనులను నిలదీస్తే.. తెలుగు జాతిపై దాడి.. అంటున్నారు. ‘ఓటుకు కోట్లు’ చేయాలని ఆయనకేమైనా తెలుగు జాతి చెప్పిందా? తప్పుడు పనులేమైనా చేయాలని రాష్ట్ర ప్రజలేమైనా పురమాయించారా?!’ అని జగన్ పేర్కొన్నారు.