నాంపల్లి కోర్టుకు వైఎస్ జగన్, సబితా

Friday, June 7th, 2013, 10:58:13 AM IST

వైసిపి నేత జగన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. దాల్మియా సిమెంట్స్ పై దాఖలైన ఛార్జ్ షీట్ కేసులో ఆయనతోపాటు మొత్తం 13 మంది కోర్టుకు హాజరవుతున్నారు. ఆరునెలల తర్వాత జైలు గోడల నుంచి జగన్ బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే అందరికీ అభివాదం చేసిన జగన్.. పోలీసులు కేటాయించిన ప్రత్యేక వాహనంలో భారీ భద్రత నడుమ కోర్టుకు బయలుదేరి వెళ్లారు. గతేడాది డిసెంబర్ 4న చంచల్ గూడ జైల్ నుంచి బయటకు వచ్చిన జగన్ ఆ తర్వాత.. మళ్లీ ఇదే మొదటిసారి.

సబిత కోర్టులో హాజరు
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆమె తన కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చారు. దాల్మియా సిమెంట్ తో కుమ్మక్కై జీవోలు జారీ చేసి జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టారనే ఆరోపణలపై సబితపై సిబిఐ అభియోగాలు మోపింది. జగతి, భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టినందుకు దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి నిక్షేపాలను ఉద్దేశపూర్వకంగా కట్టబెట్టి.. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. ఈ వ్యవహారంలో సబిత నాల్గవ నిందితురాలుగా ఉన్నారు. మరోవైపు ఆడిటర్ విజయసాయిరెడ్డిని అధికారులు కోర్టుకు హాజరు పరిచారు.

జగన్ ను చూసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా తరలి వచ్చారు. అటు జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి కూడా కోర్టుకు వచ్చారు.