పాదయాత్ర రూట్ మ్యాప్ అదిరింది..కానీ డెసిషన్ చెడింది..!

Thursday, October 26th, 2017, 02:46:19 PM IST

వైసిపికి ఇది డూ ఆర్ డై సిట్యుయేషన్. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లో విజయం సాధించడానికి ఆయుధంలా భావిస్తున్న జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం అయిపోయింది. ప్రణాళిక బద్దంగా సాగనున్న జగన్ పాదయాత్రపైనే వైసిపి నేతలంతా ఆశలు పెట్టుకుని ఉన్నారు. కాగా జగన్ పార్టీకి ఎక్కువగా పట్టు ఉండే సీమ జిల్లాల్లోనే దాదాపు రెండు నెలల పాటు పాదయాత్ర సాగనుంది. నవంబర్ నాలుగున జగన్ తిరుపతికి చేరుకొని కాలి నడకన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. రెండు నెలల పాటు కడప, అనంతపురం,కర్నూలు జిల్లాలోనే జగన్ పాదయాత్ర సాగనుంది. అనంతరం మిగిలిన జిల్లాలలో పాదయాత్ర ఉండబోతోంది. ఇదిలా ఉండగా జగన్ పాదయాత్ర విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అదే సమయంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.

మొదట నవంబర్ 2 నుంచి పాదయాత్ర మొదలుపెట్టాలనుకున్న జగన్ దానిని కాస్త 6 వ తేదీకి మార్చారు. పాదయాత్ర రూట్ మ్యాప్ ని ప్రణాళిక బద్దంగా రూపొందిచుకున్నా అసెంబ్లీ సమావేశాల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉండదు. తాను లేకుండా మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావడం సరికాదని నిర్ణయించుకున్న జగన్.. తన పార్టీ మొత్తం శీతాకాల సమావేశాలని బాయ్ కాట్ చేస్తోందని ప్రకటించారు. ఈ నిర్ణయమే విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీని పూర్తిగా బాయ్ కాట్ చేయడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి వైసిపి వినిపిస్తున్న రాగం ఏంటంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యే లపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదనే వాదనని వినిపిస్తోంది. స్పీకర్ వైఖరికి నిరసనగా తాము అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఈ నిర్ణయంపై బిజెపి కూడా మండిపడుతోంది. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు చప్పగా ఉంటాయని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయ పడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసుకున్నా మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని అన్నారు. ప్రతిపక్షం ప్రజలలోనే కాదని అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments