ఆ సినిమాలో జగన్ సీన్ ఉంటుందా..!!

Tuesday, January 2nd, 2018, 04:26:16 PM IST

స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ కు అంతా సిద్ధం అయింది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ బయోపిక్ పై సినిమావాళ్ల కన్నా రాజకీయ వర్గాలకే ఎక్కువ ఆసక్తి నెలకొనివుంది. ఎన్టీఆర్ కు సినీ జీవితంలో ఎదురులేదు. రాజకీయాల్లోకి సంచలనంగా ప్రవేశించిన ఎన్టీఆర్ అఖండ విజయం సాధించి చివరి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. బాబుని ఎప్పుడు టార్గెట్ చేసినా విపక్షాలు ఈ టాపిక్ తీసుకుని వస్తాయి. కాగా ఎన్టీఆర్ బయోపిక్ ని స్వయంగా బాలకృష్ణ తీస్తుండడంతో టీడీపీకి, చంద్రబాబుకు అనుకూలంగా ఆ వివాదానికి చెందిన వర్షన్ మారవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ బయోపిక్ అంటే టీడీపీకి ఎంతోకొంత మైలేజి ఏర్పడడం ఖాయం. సరిగ్గా ఈ చిత్రం ఎన్నికలకు ముందు విడుదల కానుంది.

అధికార పార్టీ అద్భుతమైన వ్యూహం పన్నుతుంటే.. ప్రతిపక్షం ఊరకే ఉంటుందా.. అందుకే వైఎస్ఆర్
బయోపిక్ ఇప్పుడు తెరపైకి వచ్చేసింది. వైఎస్ పాదయాత్ర చేసిన వైనం, ముఖ్యమంత్రి అయ్యాక చేపట్టిన సంక్షేమ పథకాలు ఆన్ స్క్రీన్ పై బాగా పండే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్ర కచ్చితంగా ఉంటుంది. కానీ వైఎస్ఆర్ బయోపిక్ లో జగన్ కు ఎలాంటి పాత్ర ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వైఎస్ హయాంలో జగన్ లీడర్ హైలైట్ అయిన అంశాలు అంతగా లేవు. వైఎస్ ఉన్నప్పుడు జగన్ ఎంపీగా ఢిల్లీకే పరిమితం అయ్యారు. వైఎస్ మరణం తరువాత జగన్ పేరు బాగా ప్రచారం పొందింది. కాగా వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి నటించనున్నారు.