చంద్ర‌బాబు సిత్రాలు.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన జ‌గ‌న్..!

Thursday, December 6th, 2018, 07:12:22 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయవ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పాద‌య‌త్ర చేస్తున్న జ‌గన్ అక్క‌డ‌ ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకలపాలెంలో నిర్వ‌హించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు ఉంటే.. ప‌క్క‌రాష్ట్రంలోకి వెళ్ళి క‌థలు చెప్పుతున్నాడ‌ని జ‌గ‌న్ మండి ప‌డ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించాలంటూ చంద్రబాబు నీతులు వల్లెవేస్తున్నాడ‌ని.. అవే నీతులు ఏపీలో ప‌నిచేయ‌వా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

ఇక హైద‌రాబాద్‌లో తానే ఎక్కువ అభివృద్ధి చేశానంటూ వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబుకే జ‌గ‌న్ లెక్క‌ల‌తో స‌హా ఇచ్చిన కౌంట‌ర్లు ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు నేనే క‌ట్టానని చంద్ర‌బాబు చెబుతున్నాడ‌ని.. అస‌లుశంషాబాద్ ఎయిర్ పోర్టు పనులు వైఎస్ హయంలో 2005లో ప్రారంభమై… 2008లో పూర్తయ్యాయి. ఇక ఔట‌ర్ రింగ్ రోడ్డు కూడా వైఎస్ హ‌యాంలో 2005 డిసెంబర్‌లో ప్రారభమయ్యింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 11 కిలోమీటర్ల పీవీ నరసింహారావు ఫ్రైఓవర్ వైఎస్ పూర్తి చేశారు.

అలాగే హైద‌రాబాదులో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది నేనే అని బాబు డ‌బ్బా కొట్టు కుంటున్నార‌ని… చంద్రబాబు హయాంలో ఐటీ రంగం వృద్ధి రేటు 8 శాతం ఉంటే… వైఎస్ హయాంలో 14 శాతం ఉంది. చంద్రబాబు హయాంలో ఐటీలో రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంటే… వైఎస్ హయాంలో 3వ స్థానానికి వెళ్లింది. చంద్రబాబు హయంలో 909 ఐటీ కంపెనీలు ఏర్పాటైతే… వైఎస్ హయంలో 1585 ఐటీ కంపెనీలు కొత్తగా వచ్చాయి. చంద్రబాబు హయాంలో 85945 ఐటీ ఉద్యోగాలు వస్తే.. వైఎస్ హయాంలో 2,64,375 ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. చంద్రబాబు హయంలో 3,533 కోట్ల ఐటీ పెట్టుబడులు వస్తే… వైఎస్ హయాంలో 13,250 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. చంద్రబాబు హయాంలో 5,025 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే… వైఎస్ హయాంలో 33,482 కోట్ల ఐటీ ఎగుమతులు అయ్యాయి.

ఒక‌సారి మొత్తం విశ్లేషించుకుటే.. చంద్రబాబు హయాంలో అప్ప‌టి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి లాభం కంటే న‌ష్ట‌మే జ‌రిగింద‌ని.., ఆల్విన్ కంపెనీ, రిపబ్లిక్ ఫోర్జ్, నిజాం షుగర్స్, పాలేరు షుగర్స్, అదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులు, సిర్పూర్ పేపర్ మిల్లులు.. ఇలా అనేక ప్రభుత్వ కంపెనీలను చంద్రబాబు అమ్మేశారని జ‌గ‌న్ ఆరోపించారు. ఇక‌ సొంత కంపెనీ హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీ నిర్వీర్యం చేశార‌ని ఫైర్ అయ్యారు జ‌గ‌న్. అంతే కాకుండా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు తానే కనిపెట్టానని, సత్యా నాదెళ్లకు కంప్యూటర్ నేర్పించానని, పీవీ సింధూకు బ్యాడ్మంటన్ నేర్పించానని చంద్రబాబు పిట్టలదొర కథలు చెబుతున్నారని.. కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించి ప‌క్క రాష్ట్రంలోకి వెళ్ళి డ‌బ్బాలు కొట్టుకుంటున్నార‌ని, ఏపీలో ఎంత ద‌రువేసినా చంద్ర‌బాబును లైట్ తీసుకోవ‌డంతో తెలంగాణ‌లో పిట్ట‌ల దొర వేశాలు వేస్తున్నాడ‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి జ‌గ‌న్ వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.