ఏపీ అఫీషియ‌ల్.. రాజ‌కీయ‌వ‌ర్గాల్ని ఊపేస్తున్న జ‌గ‌న్ వ్యాఖ్య‌లు..!

Thursday, January 10th, 2019, 09:50:46 AM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని జగన్ చెప్ప‌డం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఏపీలో 25 పార్ల‌మెంట్లు ఉన్న నేప‌ధ్యంలో, మొత్తం 25 జిల్లాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని, ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని జ‌గ‌న్ అన్నారు.

ఇక అన్ని గ్రామాల్లో, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి స్థానికంగా యువతకు ఉపాధిఅవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యం వస్తుందన్నారు. ప్రతి పథకం పేద వాడి ఇంటివద్దకే వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా కేవలం అర్హత మాత్రమే చూస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు.

అలాగే ప్రతి గ్రామంలో యాభై ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియ‌మిస్తామ‌ని, వారికి ఐదు వేలు జీతమిస్తామ‌ని.. ఆ యాభై ఇళ్లకు పథకాలు అందించే బాధ్యత అతనిదేనన్నారు. గ్రామ సచివాలయంతో సంప్రదిస్తూ పథకాలను సక్రమంగా అమలు చేసే బాధ్యతను అతనిపైనే ఉంచుతామన్నారు. రేషన్ బియ్యం కూడా నేరుగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నవరత్నాల్లో ప్రతి అంశమూ ఎవరి చుట్టూ తిరిగే పనిలేకుండా, సిఫార్సు లేకుండా, లంచం ఇవ్వకుండా నేరుగా ఇంటికి వచ్చేలా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీంతో జ‌గ‌న్ ఇచ్చిన తాజా హామీ పై రాష్ట్రంలో పెద్ద చ‌ర్చ‌లే జ‌రుగుతున్నాయి.