బెజ‌వాడ పాలిటిక్స్ : వైసీపీ ధ‌మాకా ఏ రేంజ్‌లో.. జ‌గ‌న్ సంచ‌ల‌న సూచ‌న‌లు..!

Sunday, February 3rd, 2019, 12:10:56 PM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ప్ర‌తిప‌క్ష వైసీపీలో అభ్య‌ర్ధుల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తుంది. ముఖ్యంగా విజ‌య‌వాడ‌లో ప‌ట్టు సాధించ‌డానికి వైసీపీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. విజ‌య‌వాడ‌లో ఉన్న మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో, గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీ కైవ‌సం చేసుకుంది. అయితే అక్క‌డ వైసీపీ గుర్తు పై గెలిచిన జ‌లీల్ ఖాన్, చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో విజ‌యవాడ ప‌శ్చిమ సీటును ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని వైసీపీ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ఈ క్ర‌మంలో ఇక్కడ పార్టీ సమన్వయ కర్తగా మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో టిక్కెట్ త‌న‌కే దక్కుతుందన్న ఆశతో ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు వెలంపల్లికి ధీటుగా మరో వైసీపీ నేత పోతిన వెంకట ప్రసాద్ నియోజక వర్గంలో దూసుకుపోతున్నారు.. బీసీ నేత అయిన పోతిన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పశ్చిమలో 40 వేల వరకు ఉన్నాయి. వారితో పాటు మిగిలిన వర్గాలలో ఉన్న పరిచయాలు తనకు ప్లస్ అవుతాయని ఆయన నమ్మకంగా ఉన్నారు. దీంతో ఈయ‌న కూడా త‌న‌కే విజ‌య‌వాడ వెస్ట్ టిక్కెట్ ద‌క్కుతుంద‌నే ఆశ‌తో ఉన్నారు.

ఇక మ‌రోవైపు విజ‌య‌వాడ వెస్ట్ సీటు మైనార్టీ సీటు కావున‌, గ‌త ఎన్నిక‌ల్లో మైనారిటీ నేత జ‌లీల్ ఖాన్‌కు కేటాయిస్తే.. గెలుపొందాని, దీంతో మ‌రోసారి వైసీపీ నుండి మైనారిటీల‌కే టిక్కెట్ కేటాయించాల‌నే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ప్రస్తుతం మాజీ మంత్రి బేగ్ కుమారుడు.. ఎంఎస్ బేగ్‌కే ఈ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజక వర్గంలో మైనార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా ఉందని, గతంలో కూడా పశ్చిమ నియోజక వర్గ ప్రజలు మైనార్టీ నేతలను పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేస్తున్నారు.

ఇక ఈసారి కూడా మైనార్టీలకు టికెట్‌ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని పార్టీలో మైనార్టీ అధ్యయన కమిటీ సభ్యుడుగా ఉన్న ఎంఎస్ బేగ్ చెబుతున్నారు. దీంతో వెలంపల్లి శ్రీనివాస్, పోతిన వెంకట ప్రసాద్, పోతిన వెంకట ప్రసాద్.. ఈ ముగ్గురిని వారి వారి కార్య‌క‌ర్త‌ల‌తో ఒకేచోట కూర్చోబెట్టి, టిక్కెట్ విష‌యంలో వారినే తేల్చుకోమ‌ని, ఒక‌రికి, ఒక‌రు స‌హ‌క‌రించేవిధంగా ప‌శ్చిమ టిక్కెట్ విష‌యంలో ఎలాంటి విభేదాలు లేకుండా ఒక నిర్ణ‌యానికి రావాల‌ని, టిక్కెట్ విష‌యంలో మ‌న‌లో మ‌నం గొడ‌వ ప‌డితే ఎవ‌రికీ ఉప‌యోగం ఉండ‌దని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌లో వైసీపీ ధ‌మాకా మాత్రం ఓ రేంజ్‌లో ఉండాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారికి సూచించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి మ‌రో మూడు నెలల్లో ఎన్నిక‌లు జరుగ‌నుండ‌డంతో బెజ‌వాడ‌లో వైసీపీ ధ‌మాకా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాల‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.