జగన్ పాదయాత్ర ముగింపు రసవత్తరం..!

Wednesday, November 14th, 2018, 04:08:02 PM IST

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర మొదలు పెట్టి ఏడాది గడిచింది. పాదయాత్రలో ఇంకా ఒక్క జిల్లాయే మిగిలుండటంతో క్లైమాక్స్ కు చేరుకుందనే చెప్పాలి, సినిమాల్లో లాగా ఈ పాదయాత్ర క్లైమాక్స్ చేరుకునే సమయానికి జగన్ పై హత్యాయత్నం అనే ట్విస్ట్ వచ్చి పడి అప్పటిదాకా రొటీన్ గా సాగుతుందన్న పాదయాత్రలో మసాలా జోడించింది. ఫలితంగా దాడి జరిగిన తర్వాత జగన్ మొదలు పెట్టిన పాదయాత్రకు మునుపటికి మించిన జనస్పందన వస్తోంది.

పునః ప్రారంభమైన జగన్ పాదయాత్రకు వస్తున్న జనాలు అందరిలో ఒక్కటే ఉత్కంఠ, ఆయనపై జరిగిన దాడి విషయమై జగన్ ఎలా స్పందిస్తారా అని. ఆ విషయంలో జనాలకే కాదు, టీడీపీ నుండి సామాన్య ఓటరు వరకు ఇదే ఉత్కంఠ. కానీ, జగన్ మాత్రం ఆ విషయంపై స్పందించకుండా పక్కా వ్యూహం ప్రకారం కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఆయన ఇప్పటికి కూడా స్పందించకపోవటం వల్లే అందరూ ఇంకా స్పందన కోసం ఎదురు చూస్తున్నారు, సరిగ్గా గమనిస్తే ఇదే జగన్ వ్యూహంలా కనిపిస్తుంది. ఈ విషయం పై స్పందించకుండా కోర్టులో ఈ కేసుపై తుది తీర్పు వచ్చేవరకు వేచి చూసి, పాదయాత్ర చివర్లో స్పందించి నాటకీయత పెంచి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నదే జగన్ వ్యూహంలా ఉంది. ఇదిలా ఉండగా వైసీపీ లోకి చేరికలు పెరుగుతున్నాయి, విరామం తర్వాత ప్రారంభించిన పాదయాత్రలో బీసీ జెఎసీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, జగన్ సొంత జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సి. రామచంద్రయ్య పార్టీలో చేరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మరిన్ని చేరికలు, ఇంకా చాలా షాక్ లు ఉండబోతున్నాయని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.