అస‌లు దేశంలో ఏం జ‌రుగుతోంది?

Thursday, October 25th, 2018, 11:20:31 AM IST

బ్రిటీష్ మూక‌ల నుంచి భార‌తావ‌నికి స్వ‌తంత్య్రం ల‌భించి 71 ఏళ్లు గ‌డుస్తున్నా ఇంకా సామాన్య భార‌తానికి స్వాతంత్య్రం, స్వేచ్ఛా ల‌భించ‌లేదు. అర్థ్ర రాత్రి మ‌న‌కు స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించిన తెల్లోడు వెళుతూ వెళుతూ త‌న డూపు న‌ల్లోన్ని కూడా భార‌త‌జాతికి అంట‌గ‌ట్టిపోయాడు. వాడి ప్ర‌తిరూప‌మే నీతిమాలిన రాజ‌కీయ నాయ‌కుడు. కుల‌, మ‌త, వ‌ర్గ‌, ప్రాంత రాజ‌కీయాల‌తో పొలిటిక‌ల్ గేమ్ భార‌తంలో ఎన్నో ఏళ్ల క్రిత‌మే వేళ్లూనుకుని వ‌ట వృక్షంగా మారి క‌రాళ నృత్యం చేస్తోంది. దేశాన్ని భావిత‌రాల‌కు ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతామ‌ని భ‌జ‌న చేసే పాల‌కులు స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం అథఃపాతాళానికి తొక్కేస్తున్న వైనం సామాన్య భార‌తాన్ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది.

ఇత‌ర దేశాల‌కు పోటీగా భావిభార‌తాన్ని త‌యారు చేస్తామ‌ని ప్ర‌తిసారీ ఎల‌క్ష‌న్ల‌ స‌మ‌యంలో ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన పాల‌కులు ఇప్పుడు అదే భార‌తాన్ని మూక‌స్వామ్యం పేరుతో హ‌త్య చేస్తుండ‌టం ఇదేనా మ‌నం క‌ల‌లు గ‌న్న భార‌తం అని యువ‌త బెంబేలెత్తుతోంది. స్వ‌రాజ్యాన్ని పోరాడి సిద్దింప‌జేసిన పోరాట యోధులు విల‌పించే దుస్థితికి స‌న్నివేశం దిగ‌జారుతోంది. అర్థ‌రాత్రి మ‌న‌కు స్వాతంత్య్రం సిద్ధిస్తే భార‌తీయ జ‌న‌తా పార్టీ అదే అర్థ‌రాత్రి భావిభార‌త కీల‌క విభాగాల‌ను కూలుస్తూ వ‌స్తోంది. నోట్ల ర‌ద్దును అర్థ‌రాత్రి ప్ర‌క‌టించి సామాన్య జ‌నంపై త‌న రాక్ష‌స‌క్రీడ‌ను మొద‌లుపెట్టిన ప్ర‌ధాని మోదీ ఆ త‌రువాత కూడా అదే త‌ర‌హా నిర్ణ‌యాల‌తో సామ‌న్యుల‌ను బ‌క‌రాల‌ను చేసి ఆడుకోవ‌డం రాజ‌కీయ పండితుల‌నే విస్మ‌యానికి గురిచేసింది.

దేశంలోని కీల‌క శాఖ‌లైన ప్ర‌ణాళికా సంఘాన్ని ర‌ద్దు చేయ‌డం ద‌గ్గ‌రి నుంచి ఆర్‌బీఐని అదుపులో పెట్టుకోవ‌డం…ఐటీ శాఖ‌ను ఇష్టారాజ్యంగా వాడుకోవ‌డం… న్యాయ వ్య‌వ‌స్థ‌ని కూడా ప్ర‌భావితం చేయ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది. ఇటీవ‌ల మోదీ ప‌ర్య‌ట‌న ఉంద‌ని తెలిసి ఆయ‌న ప‌ర్య‌ట‌న త‌రువాతే ఈసీ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్‌కు సంబంధించిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ను నిర్వ‌హించ‌డం… దేశ అత్యున్న‌త‌మైన సీబీఐనీ కూడా స‌ర్వ‌నాశ‌నం చేయ‌డంతో మేధావులు సైతం దేశం ఎటు పోతోంది… ఏమైపోతోంది? అంటూ నెత్తీనోరూ బాదుకుంటున్నారు. స‌గ‌టు మ‌నిషి గోడుని వినే తీరిక లేని రాజ‌కీయ వ్య‌వ‌స్థ రాచ‌రిక వ్య‌వ‌స్థ‌ క‌న్నా ప్ర‌మాద‌క‌రం…నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో విదేశాల్లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాని మోదీ ప‌లికిన మాట‌లే ఇందుకు నిద‌ర్శ‌నం.. ఘ‌ర్ మే షాదీ హై.. లెకిన్ పైసే న‌హీ హై` అంటూ సామాన్య భార‌తాన్ని వెకిలిగా అప‌హాస్యం చేసిన తీరు రాజ‌కీయాలంటే సామాన్య జ‌నానికి వెగ‌టు పుట్టేలా చేశాయి. ఇక‌నైనా మేధావులు, ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్, యువ‌త మేల్కొన‌క‌పోతే దేశాన్ని ప‌రాయి దేశాల‌కు రాజ‌కీయ నాయ‌కులు టోకుగా అమ్మే ప్ర‌మాదం వుందని మేధావి వ‌ర్గం గొంతెత్తి అరుస్తోంది. జాగో ఇండియా జాగో.. దేశానికి అదోగ‌తేనా? అస‌లేం జ‌రుగుతోంది?