జనసేన సర్వే…13 జిల్లాల్లో 57 నుంచి 62 స్థానాలు?!

Wednesday, March 1st, 2017, 03:50:58 AM IST
జ‌య‌హో జ‌న‌సేనా.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ అభిమానుల్లో రాజుకుంటున్న ఫీవ‌ర్ ఇది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ ప‌రిణ‌తి ఉన్న రాజ‌కీయ‌నేత‌గా ఏపీ ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తున్నాడు. ఇదివ‌ర‌కూ బ‌హిరంగ స‌భ‌లన్నీ గ్రాండ్ స‌క్సెస్ అవ్వ‌డంతో ప‌వ‌న్‌లోనూ ఆ ఊపు క‌నిపిస్తోంది. ప్ర‌జా సేవ‌లో చిత్త‌శుద్ధితో ఉంటాన‌ని ప‌దే ప‌దే ప‌వ‌న్ జ‌నాల‌కు చెబుతుండ‌డంతో అత‌డిపై న‌మ్మ‌కం మ‌రింత పెరుగుతోంది. నానాటికీ కామ‌న్ జ‌నాల్లో ప‌వ‌న్ మానియా స్ప‌ష్టంగా పెరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా కాపు బ‌ల‌గాల‌న్నీ ప‌వ‌న్‌ని ఎలాగైనా సీఎంగా చూడాల‌న్న క‌సిని ప్ర‌దర్శిస్తున్నాయి. అందుకే జ‌న‌సేనాని బ‌లం విష‌యంలో ప్ర‌త్య‌ర్థులు ఓకింత భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

చంద్ర‌బాబు, జ‌గ‌న్ స‌హా విపక్షాల్లో కొంద‌రు ప‌వ‌న్‌పై దుమ్మెత్తి పోయ‌డం వెన‌క అస‌లు క‌థ కూడా అదే. అయితే ఎదుటివాడు ఎవ‌డైనా నేను బ‌రిలో దిగిపోతున్నా.. అంటూ ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. 2019ఎన్నిక‌ల్లో త‌న పోటీని ఖ‌రారు చేశారు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాల్లో హీట్ పెరిగింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో జ‌న‌సేన ఉంటే ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎవ‌రి అంచ‌నాలు ఏవైనా.. జ‌న‌సేన పార్టీ  అధికార ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ సుంకర ప‌క్కా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 2019 ఎన్నిక‌ల బ‌రిలో జ‌న‌సేన హ‌వా న‌డుస్తుంద‌ని ఆయ‌న జోశ్యం చెప్పారు. ఎవ‌రెన్ని స‌ర్వేలు చేసుకున్నా, మా అంత‌ర్గ‌త‌ సర్వే ఫలితాల ప్రకారం 13 జిల్లాల్లో 57 నుంచి 62 స్థానాల్ని సొంతం చేసుకుంటామని తేలింద‌ని దిలీప్ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా సేమ్ రిజ‌ల్ట్ ఉంటుంద‌న్నారాయ‌న‌. అలాగే ప్రాంతీయ పార్టీల‌తో పొత్తు ఆలోచ‌న లేద‌ని, జాతీయ పార్టీల‌తోనూ అంట‌కాగే ఆలోచ‌న త‌మ నేత‌కు లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కంటే ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డ‌మే ధ్యేయంగా జ‌న‌సేన ప‌నిచేస్తుంద‌ని దిలీప్ తెలిపారు.