అగ్నిగుండం లా మారనున్న జనగామ…

Thursday, November 15th, 2018, 01:35:08 AM IST

మరోసారి కాంగ్రెస్ పార్టీ తాజాగా రెండో విడుత అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. అయితే ఈ జాబితాలో కూడా టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. జనగామ స్థానంలో అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. అయితే పొన్నాలకు టికెట్‌ కేటాయించకుంటే జనగామ ప్రాంతం అగ్నిగుండంగా మారుతుందని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. జనగామ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొని మాట్లాడారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం, సీనియర్‌ బీసీ నేతగా ఉన్న పొన్నాలకు పార్టీ అధిష్ఠానం టికెట్‌ విషయంలో ఇబ్బందులకి గురి చేయడం బాలేదు. అధిష్ఠానం పొన్నాలకు టికెట్‌ ఖరారు చేసి పొన్నాల గౌరవం ఇనుమడింపచేయాలన్నారు. పొన్నాలకు టికెట్‌ రాకుంటే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు మహాకూటమి నాయకులు ప్రచారంలో తిరగలేరన్నారు. నియోజకవర్గాన్ని అగ్నిగుండంగా మార్చి ఉద్యమిస్తామన్నారు.

మరోవైపు పొన్నాలకు టికెట్‌ కేటాయించాలని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. టికెట్‌ ఇచ్చే విషయంలో జరుగుతున్న జాప్యానికి మనస్థాపానికి గురైన యువజన కాంగ్రెస్‌ కార్యకర్త బొల్గం రాజు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో పొన్నాలకు టికెట్ కేటాయించాలని నినాదాలు చేస్తూ ఒంటిపై పెట్రోలు పోసుకోవడానికి యత్నించగా అక్కడ ఉన్న నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలుసుకున్న పొన్నాల లక్ష్మయ్య ఫోన్‌ ద్వారా రాజును పరామర్శించి ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఓపికతో ఎదురు చూద్దాం అని కోరారు.