2019 బిగ్ ఫైట్.. జ‌నార్ధ‌న్ వ‌ర్సెస్ బాలినేని.. ఒంగోలులో హోరా హోరీ త‌ప్ప‌దా..?

Monday, October 29th, 2018, 01:21:33 PM IST

ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికారం ప్ర‌తిప‌క్షాలు నువ్వా-నేనా అన్న‌ట్టు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మ‌రోసారి అధికారం చేప‌ట్టాల‌ని అధికార టీడీపీ భావిస్తుండ‌గా.. ఎలాగైనా టీడీపీని ఓడించి తొలిసారి అధికారంలోకి రావాల‌ని వైసీపీ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇక మేము కూడా రేసులో ఉన్నామంటూ తెర‌పైకి వ‌చ్చిన జ‌న‌సేన ఎంత‌వ‌ర‌కు ప్ర‌భావం చూపుతుందో చూడాలి.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌ ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఆ జిల్లాలో ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ రాజ‌కీయవ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2004 నుండి హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు చేసిన బాలినేని శ్రీనివాస‌రెడ్డిని 20వేల‌కు పైగానే ఓట్ల‌తో ఓడించిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ మంచి ఊపుమీద ఉన్నారు. గ‌డ‌చిన నాలుగేళ్ళ‌లో ఒంగోలు నియోజ‌క వ‌ర్గంలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశారు జ‌నార్ధ‌న్. ఒక‌వైపు అధికారుల‌తో.. మ‌రోవైపు పార్టీ నేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు పోతున్నారు జ‌నార్ధ‌న్.

ఇక మ‌రోవైపు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ఓ వెలుగు వెలిగిన వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో పూర్తిగా ప‌ట్టుకోల్పోయారు. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో వైసీపీ విప‌రీతంగా బ‌లం పుంజున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బాలినేని కూడా త‌న సొంత నియోజ‌క వ‌ర్గంలో క్ర‌మంగా ప‌ట్టు పెంచుకుంటూ వ‌చ్చార‌ని.. అందులో భాగంగానే దిగువ‌శ్రేణి కార్య‌క‌ర్త‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నార‌ని టాక్. ఈ నేప‌ధ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌నార్ధ‌న్ వ‌ర్సెస్ బాలినేని పోటీ హోరా హోరీగా ఉండ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ప్ర‌కాశం హెడ్‌క్వార్ట‌ర్‌లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.