ఎలక్షన్ 2019: తెలంగాణ లోక్ సభ బరిలో జనసేన – ప్లాన్ సిద్దమైందా..?

Friday, February 8th, 2019, 10:05:25 AM IST


గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చిన సమయంలో, అంత తక్కువ సమయంలో పోటీకి సిద్ధం కాలేకపోయామని కారణం చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండ పోటీ చేస్తామని అప్పట్లోనే ప్రకటించాడు, అన్నట్టుగానే ఇప్పుడు జనసేన తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ మేరకు పలు లోక్ సభ స్థానాల పరిధిలో పని చేసేందుకు కమిటీలను, ఇన్ చార్జీలను ప్రకటించారు.

ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఖమ్మం లోక్ సభ స్థానాలకు కమిటీలను ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే మిగతా లోక్ సభ స్థానాలకు కూడా కమిటీలను ప్రకటించనున్నట్టు సమాచారం,ఇప్పటికే నాగర్ కర్నూల్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, భువనగిరి, వరంగల్ స్థానాలకు కమిటీలు సిద్దమయ్యిందని త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం. ముందుగానే ప్రకటించినట్టుగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా బరిలో దిగాలని జనసేనాని భావిస్తున్నట్టు సమాచారం, కాకపోతే ఇప్పటికే వామపక్షాలతో పొత్తు ప్రకటించారు కాబట్టి, అందులోను తెలంగాణలోని మూడు, నాలుగు నియోజకవర్గాల్లో సిపిఎం పార్టీకి బలం ఉన్నందున ఆ స్థానాలు వారికిచ్చి మిగతా స్థానాల్లో జనసేన పోటీ చేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉంచినట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన పార్లమెంట్ బరిలో దిగేందుకు సిద్దమైందన్నమాట, మరి జనసేన ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.