కుట్రలతో జనసేనాని ఎవరు ఆపలేరు: పవన్ కళ్యాణ్

Friday, April 27th, 2018, 03:45:44 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎప్పుడు లేనివిధంగా తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన పోరాటం ఎంత మాత్రం ఆగదని జనసేన అధినేత లేఖ ద్వారా తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లాలన్న తన సంకల్పాన్ని ఎవరు వమ్ము చేయలేరని చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిపి కొన్ని జిల్లాలలో సుదీర్ఘమైన పర్యటనలు జరపడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఫిక్స్ అయ్యారు. అలాగే ప్రధాన సమస్యల గురించి రాష్ట్ర అభివృద్ధిలో అధికార పార్టీ టీడీపీ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధన ధ్యేయంగా పర్యటిస్తానని తెలిపారు. రెండు మూడు వారాల్లో పర్యటనకు సంబందించిన ప్రణాళికలు సిద్దమవుతాయని పేర్కొన్నారు.

తొలుత ఈ నెల 21, 22 , 23 తేదీలలో పవన్ కళ్యాణ్ పాల్గొనే కార్యక్రమాలను పార్టీ సిద్ధం చేసింది. శెట్టిపల్లెలో భూ సేకరణ సమస్య, చిత్తూరు పట్టణంలో హైరోడ్డు నిర్మాణంలో బాధితులకు జరుగుతున్న అన్యాయం వంటి ప్రజా సమస్యలపై ఆయన పర్యటనను పార్టీ సిద్ధం చేసింది. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురం నివాసి, కామన్వెల్త్ క్రీడల్లో విజేత వెయిట్ లిఫ్టర్ వెంకట్ రాహుల్ కు ఈ నెల 30 న స్టువర్టుపురం నుంచి ఊరేగింపు, బాపట్లలో పౌరసన్మానాన్ని చేయాలని పవన్ కళ్యాణ్ తలపెట్టారు. ఈ రెండు జిల్లాల్లో కార్యక్రమాల కోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రజలు, ప్రజా ఆస్తులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను పార్టీ వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు.

అలాగే మరొక విషయాన్ని కూడా తెలియాజేస్తూ.. జనసేన పార్టీపై ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి భయపడిన కొన్ని స్వార్థపూరిత శక్తుల దుష్ట పన్నాగాలను పోలీస్ నిఘావర్గాలు పసిగట్టాయి. ఈ నెలలో చిత్తూరు, గుంటూరు జిల్లా బాపట్లలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తలపెట్టిన కార్యక్రమాల్లో తునిలో జరిగిన రైలు విధ్వంస వంటి చర్యలకు పాల్పడి ‘జనసేన’కు అపకీర్తి వచ్చేలా కుట్ర జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయని ప్రకటనలో పేర్కొంది. ఇందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన కిరాయి మూకలను స్వార్థపరశక్తులు సంప్రదిస్తున్నట్లు నిఘా వర్గాలు పార్టీ నేతలను అప్రమత్తం చేయడంతో ఈ రెండు జిల్లాల్లో తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేసినట్టు జనసేన లేఖలో పేర్కొంది.

  •  
  •  
  •  
  •  

Comments