లోకేష్ చేసిన అవినీతి సంగతేంటి..?

Thursday, March 15th, 2018, 10:52:21 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా బుధవారం రాత్రి నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్కాం ఆంధ్ర అవలేదు కానీ కరప్షన్ ఆంధ్ర చేయగలిగారని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ నేతలు ప్రజలను రాష్ట్రాన్నిదోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మీ సుపుత్రుడు లోకేశ్ చేసిన అవినీతి మీ దృష్టి సారించాలేదా? ఎన్టీఆర్‌లాంటి మహానుభావుడి మనవళ్లు ఏం చేస్తున్నారు? వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మేమెందుకు మద్దతు ఇవ్వాలి? టీడీపీ నేతల అవినీతిని చూసి ప్రజలు భయపడుతున్నారు. అవినీతికి అంతు లేదా? రాజధానికి ఎన్ని వేల ఎకరాలు కావాలి? ఇంకా ఎన్ని కోట్లు తింటారు..? దోచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన వారిని తరిమికొట్టాలి అని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ తమ పార్టీ కార్యకర్తలకు ఉద్యమ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తాననడం ఏమి నాయకత్వ లక్షణమని వైస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికి తాము అవినీతికి పాల్పడుతామని టీడీపీ నేతలు బహిర్గతంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. నన్ను సీఎం ను చేస్తే ప్రజలను దోచుకున్తానని చెప్పకనే చెపుతున్నాడు.

బెజవాడ కనక దుర్గగుడి పార్కింగ్ డబ్బుల్లో ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయి కదా…

ఈ సిగ్గులేని టీడీపీ నేతలు చివరికి అవినీతిలోకి బెజవాడ కనకదుర్గమ్మను కూడా లాగారని టీడీపీ ఎమ్మెల్యేలపై పవన్ మండిపడ్డారు. దుర్గగుడి పార్కింగ్ డబ్బుల్లో ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ధ్వజమెత్తి విమర్శించారు. భక్తులను కూడా దోచుకుంటున్నారని, ఏపీలో చాలా దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఏపీ సీఎంపై వస్తున్న ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ.. హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీయకుండా, మరి మరి వాళ్లకి అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తున్నాయి? మీ జేబులోనుంచి ఆస్తులు తీసి ఏమీ ఖర్చు పెట్టడంలేదు.. ఈ డబ్బంతా అవినీతి చర్యల నుంచే వస్తున్నది అంటూ పవన్ ధ్వజమెత్తారు. ఫాతిమా మెడికల్ కాలేజీ యాజమాన్యం చేసిన మోసానికి శిక్షించాల్సింది పోయి వాళ్ళకే అండగా నిలిచారు. నాలుగేండ్లలో టీడీపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో పూర్తిగా విఫలమైందని, మూడు మాటలు, ఆరు అబద్ధాలుగా చంద్రబాబు పాలన సాగిందని మండిపడ్డారు. తాను టీడీపీకి మద్దతు పలికింది ఏపీ పునర్నిర్మాణానికే కానీ, తెలుగుదేశం పునర్నిర్మాణానికి కాదని స్పష్టంచేశారు.

ఇప్పటికి రాజధానికి స్థలం లక్ష ఎకరాలకు సమకూరింది

రాజధానికి 1500 వందల ఎకరాలుంటేచాలని చంద్రబాబు అన్నారని, అది 33 వేల నుంచి ఇప్పుడు లక్ష ఎకరాలకు చేరిందని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలు ఏం కావాలని వాటికి ఆడుకునే నాదుడు ఎవరున్నారని ప్రశ్నించాడు. అలా అయితే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం వస్తుందని పవన్ హెచ్చరించారు. అరుణ్‌జైట్లీగారు.. నాలుగేండ్లుగా ప్రజలకు మీరుచేసిన అన్యాయం మమ్మల్ని రగిలిస్తోంది.. వేధిస్తోంది, సెంటిమెంట్‌తో ప్రత్యేక హోదా రాదన్నారు.. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి మీరెలా మద్దతు పలికారు? అది మాత్రమె రాష్ట్రమా ఇది కాదా అని ప్రశ్నించారు. విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాననలేదా? అంటూ కేంద్రంలోని బీజేపీ నిలదీశారు. తాము ఢిల్లీ జంతర్‌మంతర్‌లో పోరాటం చేయబోమని, ఏపీలోనే జాతీయ రహదారులపై ధర్నాలు చేస్తామని, కేంద్రం చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ పవన్ విరుచుకుపడ్డారు. కేంద్రమంటే తమకేం భయంలేదని, తామెవరికీ భయపడబోమని అన్నారు. రాబోయే ఆగస్టు 14న జనసేన మ్యానిఫెస్టో విడుదల చేస్తామని పవన్ ప్రకటించారు. 33 వెనుకబడిన కులాలకు అండగా ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని ఆయన వెల్లడించారు.

జనసేన అభిమానుల తొక్కిసలాటలో 15మందికిపైగా గాయాలు

పార్టీ ఆవిర్భవ సభలో జనసేన కార్యకర్తలు అదుపుతప్పారు. సభలో తొక్కిసలాట జరుగడంలో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పలువురు పోలీసులకు కూడా గాయాలు కావడంతో వారిని ఎన్‌ఆర్‌ఐ దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాన్ గాయపడిన వారికి స్పెచల్ ట్రీట్మెంట్ ఇవ్వవలిసిందిగా కోరారు.