ఆ నిర్మాతకు జనసేన టికెట్ కన్ఫర్మ్ అయినట్లేనా?

Monday, May 7th, 2018, 04:25:55 PM IST


రానున్న 2019 ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు చేపట్టవలసిన కార్యకలాపాలు, ఇతరత్రా కార్యక్రమాలతో ఇప్పటినుండే కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీ కార్యకలాపాలపై కాస్త గట్టిగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాము ఏపీలోని 175 స్థానాల్లోకూడా పోటీకి సిద్ధమని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి సంబందించిన ఒక వార్త తాలూకు పుకారు, షికారు చేస్తోంది. తమ పార్టీకోసం శ్రమించి పాటుపడే వ్యక్తులను ఏ పార్టీ కూడా వదులుకోదనే విషయం తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా జనసేనకు కొంతమేర నిధుల సమీకరణ, అలానే ఎన్నారై విభాగ కార్యకలాపాలు నిర్వహణ తదితర బాధ్యతలను సమర్ధవంతం నిర్వహిస్తున్న ప్రముఖ టాలీవుడ్ నిర్మాత రామ్ తాళ్లూరికి జనసేన టికెట్ కన్ఫర్మ్ అయిందని సమాచారం.

ఇప్పటికే మంచి పారిశ్రామికవేత్తగా లీడ్ కార్పొరేషన్, రామ్ ఇన్నోవేటివ్స్, రామ్ ఎంటర్ప్రైజెస్ తదితర ఐటి సంస్థలు స్థాపించి దాదాపు 14ఏళ్లుగా ముందుకు దూసుకెళుతున్న రామ్, పవన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అందువల్లనే ఆ మధ్య ఎన్నారై విభాగ సమావేశం ఏర్పాటులో కూడా ఆయన కీలకపాత్రని వహించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఆయనకు జనసేన తరపున పార్టీ టికెట్ ఇచ్చేనందుకు పవన్ సిద్ధపడ్డారని అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న రామ్ తాళ్లూరి ఇప్పటికే పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం సరైనదని కొందరు అంటున్నారు. కాగా ఆయన నిర్మాతగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ నెల టికెట్ సినిమా ఆడియో విడుదల వేడుకకు పవన్ అందుకే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది…….