ప‌వ‌న్ తెరాసతో అంటీ ముట్ట‌న‌ట్టు!?

Sunday, November 11th, 2018, 09:21:00 AM IST

తెలంగాణ ప్ర‌భుత్వం ముంద‌స్తుకు సిద్ధ‌మైన వేళ విప‌క్ష పార్టీల‌న్నీ కూట‌మిక‌ట్టి తెరాస‌పై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతుంటే
జ‌న‌సేనాని మాత్రం త‌న దృష్టంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పైనే వుందంటూ చెప్ప‌డం రాజ‌కీయ విశ్లేష‌కుల్ని ఆలోచ‌న‌లో పడేసింది. ఉద్య‌మ స‌మ‌యంలో, తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత తెరాస‌పై , తెరాస అధినేత‌పై ఒంటికాలిపై లేచిన విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్ ఆ త‌రువాత మెత్త‌బ‌డిన విష‌యం తెలిసిందే.

తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌రువాత నుంచి తెరాస‌క అనుకూలంగా మారుతూ వ‌చ్చారంటూ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల దాడి సాగుతోంది. అయినా ఇప్ప‌టికీఅదే వైఖ‌రిని కొన‌సాగిస్తున్నందువ‌ల్ల తెలంగాణ‌లో పోటీకి దిగాల‌నే ఆలోచ‌న‌కు రావ‌డం లేద‌ని జ‌న‌సేన‌కు అత్యంత స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలా వుంటే తెలంగాణ‌లో పోటీ విష‌య‌మై రెండు రోజుల్లో ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పిన ప‌వ‌న్ చెప్ప‌డం ఎవ‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌లేదు. తెలంగాణ‌లో పోటీకి దిగితే మంచిద‌ని పార్టీ క్యాడ‌ర్ ఆశ‌గా ఎదురుచూస్తున్నా ప‌వ‌న్ మాత్రం ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. దీనికి కార‌ణం గ‌డిచిన‌ కొంత కాలంగా తెలంగాణ ప్ర‌భుత్వ ప‌నితీరును, ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌ను, రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న తీరును ఆయ‌న కొనియాడి ముఖ్య‌మంత్రిని ప్ర‌శంస‌ల్లో ముంచెత్త‌డ‌మేన‌ని చెబుతున్నారు. ఇంత చెప్పిన‌ ప‌వ‌న్ తెలంగాణలో పోటీకి దిగుతారా? అన్న‌ది ఇంకా సందిగ్ధ‌మే. జ‌న‌సేనాని సైతం సిస‌లైన రాజ‌కీయ జ్ఞానిగా .. స‌రికొత్త వ్యూహంతో క‌ద‌ల‌డం చూస్తుంటే అత‌డిలో ప‌రిణ‌తి కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్న విశ్లేష‌ణ వినిపిస్తోంది. రాజ‌కీయాల్ని వ్యూహంతో ఆడుకోవాల‌న్న నైజం అత‌డిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తెరాస‌తో అంటీ ముట్ట‌న‌ట్టు అత‌డు ఆడుతున్న తెలివైన ఆట ర‌క్తి క‌ట్టిస్తోంది. తెగే దాకా లాగ‌కుండా పూర్తిగా తెంచే దాకా వేచి చూస్తున్నాడ‌నే అర్థ‌మ‌వుతోంది. తెలంగాణ‌లో గెలిచే పార్టీ ఏదో క‌నిపెట్టి మాష్ట‌ర్ మైండ్‌తో సిస‌లైన ట్విస్టు ఇవ్వాల‌నుకుంటున్నాడా? అన్న‌ది చూడాలి.