ప‌వ‌న్ ఎదుర్కొంటున్న‌ది `నోటా` పాలిటిక్స్‌!?

Sunday, October 7th, 2018, 04:16:51 PM IST

ఒక మామూలు కుర్రాడు.. అస‌లు రాజ‌కీయాలు అంటే ఏంటో తెలీనోడు ఉన్న‌ట్టుండి సీఎం అయితే ఎలా ఉంటుంది? ఇదే కాన్సెప్టుతో విజ‌య్ దేవ‌ర‌కొండ `నోటా` చిత్రం తెర‌కెక్కింది. ఈ సినిమాని క్రిటిక్స్ ఏకిపారేసిన మాట అటుంచితే, ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు ఏపీ పాలిటిక్స్‌ని త‌ల‌పించ‌డం ప్ర‌స్తుతం కోటానుకోట్ల ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కొచ్చింది. దేశ‌మేగ‌తిన పోయినా, ప్ర‌జ‌లు ఎలా చంక‌నాకి పోయినా.. త‌మ పీఠం క‌ద‌ల‌కుండా చూసుకోవ‌డం.. రాజ‌కీయాల్లో పై చేయి కోసం ఎంత‌టి దుర్మార్గాల‌కు అయినా తెగ‌బ‌డే నాయ‌కులు ఉన్నార‌క్క‌డ‌. అధికార ప‌క్షం- ప్ర‌తిప‌క్షం దొందూ దొందే. ఆ రెండు ప‌క్షాలు ఒక‌రిపై ఒక‌రు ఎంత‌టి దుర్మార్గానికి అయినా తెగ‌బ‌డే ర‌కాలే. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం కాపు కాసుకుని కూచున్న‌ది ఒక‌రు అయితే, అస‌లు ఆ పీఠం ఎవ‌రికీ వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేని నాయ‌కుడు ఒక‌రు.. 2019 ఎన్నిక‌ల వేళ నానా తంటాలు ప‌డుతున్నారు. సీఎం పీఠం ఎక్కితే త‌నపై ఉన్న‌ అవినీతి కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు, హ‌వాలా సొమ్ముల్ని, డ‌మ్మీ కంపెనీల్ని కాపాడుకునేందుకు ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. దానికి ప్ర‌జాసేవ అనే అంద‌మైన పేరు పెట్టారు. మ‌రోవైపు అమ‌రావ‌తి పేరుతో భారీ భూదోపిడీకి, జ‌నాల దోపిడీకి తెర‌తీసి, రాష్ట్రంలో రియ‌ల్ వ్యాపారం పేరుతో వేరొక‌రికి అమ్మేయ‌డానికి సిద్ధ‌మైన ముఖ్యంత్రి చంద్ర‌బాబు త‌న అధికారం కాపాడుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై ఎత్తు పై ఎత్తు వేస్తున్నారు.

స‌రిగ్గా ఇలాంటి వేళ ఒక అమాయ‌కుడిలా, రాజ‌కీయాలు అంటే ఏంటో తెలీనివాడిగా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్ర‌వేశించాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఒక ర‌కంగా రెండు భ‌ళ్లూకాల మ‌ధ్య ప్ర‌వేశించిన ఒక సాధా సీదా లేడి కూన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అంటే త‌ప్పేం కాదు. ఒక సినిమా స్టార్‌గా ఉన్న ప‌వ‌న్ ఏనాడూ కుత్సిత బుద్ధిని చూపించిన‌వాడిగా క‌నిపించ‌లేదు. ఎదుటివారు క‌ష్టంలో ఉన్నారంటే స్పందించే మంచిత‌న‌మే ప్ర‌ద‌ర్శించాడు. ఒక ర‌కంగా `నోటా` సినిమాలో దేవ‌ర‌కొండ‌లా క‌నిపించాడు. ఆ సినిమాలో చూపించిన‌ది వాస్త‌వానికి అతీతం ఏం కాదు. సీఎం పీఠం లాక్కోవ‌డం కోసం క‌న్న‌తండ్రే కొడుకుపై దుర్మార్గానికి పాల్ప‌డ‌తాడు. అనుమాన పిశాచిలా మారి కొడుకుతోనే కుర్చీ ఆట ఆడ‌తాడు. ఇక ప్ర‌జ‌ల్ని ఆకులో వ‌క్క‌లాగా, కూర‌లో క‌రివేపాకులాగా వాడుకుంటాడు. అందుకు త‌నలోని న‌టుడిని, న‌ట‌విన్యాసాన్ని తెలివిగా ప్రెస్ ముందు వాడుకుంటాడు. అదంతా అటుంచితే ఏపీ పాలిటిక్స్ ప‌వ‌న్ ఎంత‌వ‌ర‌కూ ఈ భ‌ళ్లూకాల‌తో ఆట ఆడ‌గ‌ల‌డు? ఆడుతున్న ఆట ఎంత వ‌ర‌కూ స‌క్సెస‌వుతుంది? అన్న‌ది చూడాలి. అయితే అక్క‌డ ముఖ్య‌మంత్రి పీఠంపై ఉన్న వాళ్లు కానీ, అత‌డి చుట్టూ మోక‌రిల్లిన దుష్ట‌చ‌తుష్ఠ‌యాలు కానీ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఎంత‌కు తెగ‌బ‌డ‌డానికైనా వెన‌కాడ‌వ‌న్న సంగ‌తి ఇటీవ‌లి కాలంలో ప‌వ‌న్ నేరుగానే ఎదుర్కొంటున్నాడు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌ల్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేం. బాబుపై నెగ్గేందుకు ప‌వ‌న్ ని తెలివిగా వాడుకునే య‌త్నం చేస్తాడ‌న‌డంలో సందేహం లేదు. ఈ ఆట‌లో ప‌వ‌న్‌ని పొంచి ఉన్న ముప్పును శంకించ‌కుండా ఉండ‌లేం. ముప్పు అంటే అది చావును మించి. అత‌డు ముందే ఊహించిన ఆ ప్ర‌మాదాన్ని మించి. ఇదేమీ ఫిక్స‌న్ సినిమా కాదు. జ‌ర‌గ‌బోతున్న వాస్త‌వం. ర‌గులుతున్న రావ‌ణ కాష్టానికి ముంద‌స్తు వ్యూ. ఎన్నిక‌ల‌వ‌ర‌కూ వేచి చూస్తే ఈ సంగ‌తి ఏపీ ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. అధికారం, ధ‌నం అనే దాహంతో క‌ణ‌క‌ణ మండుతున్న రెండు అగ్రిగోళాల మ‌ధ్య ఒంట‌రిగా నిలుచుకుని ఉన్నాడు జ‌న‌సేనాని. ఆ రెండు గోళాల మ‌ధ్య నుంచి త‌న‌ను తాను కాపాడుకోవ‌డ‌మే ప‌వ‌న్ ముందున్న అస‌లు సిస‌లు ల‌క్ష్యం. అత‌డికి ఏపీ వ్యాప్తంగా ఉన్న కోటానుకోట్ల యువ‌బ‌లం అండ‌గా నిల‌వాలి. దుష్ట శ‌క్తుల నుంచి కాచే క‌వ‌చంగా మారాలి. ఈ ఆట‌లో ఎంతో అనుభ‌వం ఉన్న ఆ ఇద్ద‌రి ముందూ ప‌వ‌న్ కూడా అభిన‌యించాల్సి ఉంటుంది తెలివిగా. ఈ రియ‌ల్ `నోటా` ఆట‌లో ప‌వ‌న్ .. మ‌రో యంగ్ సీఎం దేవ‌ర‌కొండ‌లా ఆడాల్సి ఉంటుంది!!