నైజాంలో జ‌న‌సేనాని న్యూ మైండ్ గేమ్‌!?

Wednesday, October 10th, 2018, 12:04:01 PM IST

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో సైలెంట్‌గా వున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్… తెలంగాణ ప్ర‌త్యేక‌ రాష్ట్రాన్ని కేంద్రం ప్ర‌క‌టించిన త‌రువాత ఒక్క‌సారిగా మీడియా ముందుకు వ‌చ్చి నోవాటెల్‌లో అభిమానుల సాక్షిగా త‌న గోడును, బాధ‌ను వెల్ల‌గ‌క్కిన విష‌యం తెలిసిందే. అశాస్త్రీయంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ‌ను విడ‌గొట్టార‌ని, ఇలా విడ‌గొట్ట‌డం త‌న‌ను ఎంత‌గానో బాధించింద‌ని బాహాగంగానే కేంద్రంపైనా, ఉత్త‌రాది ఆధిప‌త్యంపైనా భారీ స్తాయిలో విరుచుకుపడ్డాడు. ఆ త‌రువాత తెలంగాణ అధినాయ‌క‌త్వాన్ని కూడా విమ‌ర్శంచాడు. అలాంటి ప‌వ‌న్ తెలంగాణ విష‌యంలో.. తెలంగాణ నూత‌న ప్ర‌భుత్వం విష‌యంలో మెత్త‌బ‌డుతూ రావ‌డం చ‌ర్చ‌కొచ్చింది. రాజ‌కీయాల్లో వ్యూహం మార్చుకుని తెలివైన పంథాలో వెళ్లాల‌ని ప‌వ‌న్ గ్ర‌హించిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇది తెలంగాణ‌లోనూ అత‌డికి అనుకూల ప‌వ‌నాల్ని వీచే స‌మ‌య‌మ‌ని భావించ‌వ‌చ్చు.

తెలంగాణ‌లో ముంద‌స్తు న‌గారా మోగిన ద‌రిమిలా ఇక్క‌డ పోటీకి సంబంధించి ప‌వ‌న్ ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఏపీలో పోటీకి స‌మ‌ర శంఖం పూరించిన జ‌న‌సేనాని తెలంగాణ‌లో మాత్రం ఇంకా మీన‌మేషాలు లెక్కిస్తుండ‌టం కొత్త అనుమానాల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది. గ‌త ఏపీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు బాస‌ట‌గా నిలిచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ ఎన్నిక‌ల్లో మాత్రం తెలంగాణ ర‌థ‌సార‌థి కేసీఆర్‌కు ఇండైరెక్ట్‌గా మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం వుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇదిలా వుంటే పైకి మాత్రం జ‌న‌సేన తెలంగాణ‌లో 30 నుంచి 40 సీట్ల‌లో పోటీప‌డితే మంచిద‌నే ఆలోచ‌న‌లో వుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు! అన్న చందంగా గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును గెలిపించి ఉనికిని చాటుకున్న ప‌వ‌న్ ఈసారి కేసీఆర్‌ని గెలిపించి అలాంటి గేమ్ ప్లాన్ లో స‌త్తా ఉన్న‌వాడిగా నిరూపించుకుంటార‌నే అంతా అనుకుంటున్నారు. మ‌రి ప‌వ‌న్ వ్యూ ఎలా ఉందో చూడాలి.