కేసీఆర్‌పై జ‌న‌సేనాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!.

Friday, March 15th, 2019, 11:10:54 AM IST

జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌పై సై అంటే సై అంటూ విమ‌ర్శ‌లు చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయ‌న విమ‌ర్శ‌ల‌కు ధీటుగా కేసీఆర్ కూడా వ‌రంగ‌ల్ స‌భ‌లో చిటికేస్తే వెయ్యి ముక్క‌లైత‌వ్ బిడ్డా` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల త‌రువాత ప‌వ‌న్ మ‌ళ్లీ కేసీఆర్ కుటుంబానికి ద‌గ్గ‌ర‌య్యారు. అయితే ఏపీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ మ‌ళ్లీ కేసీఆర్‌పై ప‌వ‌న్ నిప్పులు చెర‌గ‌డం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది.

జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. తెరాస నాయ‌కులు కేటీఆర్‌, కేసీఆర్‌ల‌తో నాకు, నా కుటుంబ స‌భ్యుల‌కు సాన్నిహిత్యం వుంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యానికొచ్చిన‌ప్పుడు వారితో నేను ఏకీభ‌వించ‌ను. కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మ స్వ‌రూపం. అందుకే గౌర‌వం ఇచ్చాం. అలా అని ఎంత సేపు విష‌పూరితంగా మాట్లాడితే ఎలా? ఆంధ్రుల‌ను ఇప్ప‌టికైనా వ‌దిలేయండి. మ‌నంద‌రిది ఒక‌టే దేశం. మీరు పాకిస్థానీ కాదు. మేము మాత్ర‌మే భార‌తీయులం కాదు. వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య విరోధం పెంచితే ఎలా? . ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్ని ఛీకొట్టిన కేసీఆర్‌, మోదీల‌తో జ‌గ‌న్ క‌ల‌వ‌డం స‌రికాదు. జ‌గ‌న్‌, కేసీఆర్‌, చంద్ర‌బాబు త‌మ మ‌ధ్య వున్న గొడ‌వ‌ల కార‌ణంగా రాష్ట్రాన్ని బ‌లిచేయ‌డం త‌గ‌దు. పంతం నెగ్గించుకోవ‌డం కోసం దొడ్డిదారిన ఇక్క‌డికొచ్చి ఇబ్బంది పెట్టొద్దని చేతులు జోడించి కేసీఆర్‌కు విన్న‌విస్తున్నా అని ప‌వ‌న్ ముక్తాయించ‌డం గ‌మ‌నార్హం.