షాకింగ్‌: జ‌న‌సేనాని వైఖ‌రి దేనికి సంకేతం?

Friday, January 11th, 2019, 04:10:05 PM IST

2014 ఎన్నిక‌ల్లో తెదేపాకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం ఓ ప్ర‌యోగం. అందువ‌ల్లే జ‌న‌సేన దూసుకుపోయింది. క‌డ‌ప‌, గుంటూరు జిల్లాల కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెల్ల‌డించిన ఈ అంశాలు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. గ‌త కొంత కాలంగా టీడీపీకి దూరంగా వుంటూ వ‌స్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ఆ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్న సంకేతాల్ని అందిస్తున్నార‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. తాజాగా క‌డ‌ప‌, గుంటూరు జిల్లాల కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెల్ల‌డించిన అంశాలే ఇందుకు అద్దంప‌డుతున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు. అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కావాలంటే మరో 30 ఏళ్లు ప‌డుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి చెందాల‌న్నా జ‌న‌సేన పార్టీ అవ‌స‌రం త‌ప్ప‌దు! అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా ప‌వ‌న్ త‌న‌ కార్య‌క‌ర్త‌ల‌తో చెప్ప‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

తేదేపా నాయ‌కుల‌ను నేను ఎప్పుడూ వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌లేదు. జ‌న‌సేన సిద్ధాంతాల‌కు అనుగుణంగా ప‌రిధి మేర‌కే విమ‌ర్శ‌లు చేశాన‌ని, ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్‌లా చంపేయండి, న‌రికేయండీ అని అన‌లేద‌ని వివ‌రించారు. 2014లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిపోతున్నాడు. అత‌న్ని ఆప‌డానికి మీరు ఏం చేయ‌గ‌ల‌రంటూ అంతా త‌న‌ను అడిగార‌ని, అందుకే టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలిచాన‌ని ప‌వ‌న్ తెలిపారు. చంద్ర‌బాబు మ‌రో ప‌దేళ్లు అధికారం కావాలంటున్నారు. జ‌గ‌న్ 30 ఏళ్లు అధికారంలో వుంటానంటున్నారు. వీరిద్ద‌రికి అధికారం త‌ప్ప సగ‌టు మ‌నిషి వ్య‌ధ అవ‌స‌రం లేద‌ని ఎద్దేశా చేశారు. ఓ ప‌క్క టీడీపీకి దూరం అంటున్న ప‌వ‌న్ ఆ పార్టీని ఎప్పుడూ విమ‌ర్శించ‌లేద‌ని సంకేతాలు అందించ‌డం రాజ‌కీయ విశ్లేష‌కుల్లో మ‌రో కొత్త వాద‌న‌కు తెర‌తీస్తోంది. అయితే ప‌వ‌న్ ని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. రాజ‌కీయాల్లో దిగ‌జారుడుత‌నం రాజ్య‌మేలుతున్న వేళ దానిని కాపాడేందుకు తాను కాస్త‌యినా ఒద్దిక‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడని జ‌న‌సైనికులు చెబుతున్నారు. ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రిలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప‌వ‌న్ న‌డుచుకున్నా ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌ద‌న్న‌ది జన‌సేన ముఖ్య నాయ‌కుల అభిప్రాయం.