నిరాహారదీక్షకు రెడీ అయిన జనసేనాని!

Friday, May 25th, 2018, 06:59:42 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మూడు రోజుల క్రితం ఆయన ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లోగా స్పందించాలని, అలానే ప్రభుత్వం ఆరోగ్య శాఖామంత్రిని తక్షణమే ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఇచ్చిన గడువు పూర్తి కావడంతో నేడు సాయంత్రం 5 గంటలనుండి రేపు అనగా శనివారం సాయంత్రం 5 గంటలవరకు ఆయన భోజనం ముట్టకుండా నిరాహారదీక్షలో ఉంటారని జనసేన కార్యకర్తలు, ప్రతినిధులు చెప్పారు. అయితే ఆయన ప్రస్తుతం వున్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా రేపు ఉదయం 9 గంటలనుండి ప్రజల సమక్షంలో దీక్షలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. పూర్తి శాంతియుతంగా సాగే ఈ దీక్షలో, పవన్ కు మద్దతుగా పలు జిల్లా కేంద్రాల్లో కూడా జనసేన నేతలు కొందరు దీక్ష చేపట్టనున్నారు.

ప్రభుత్వం తక్షణమే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చొరవ తీసుకోవాలని, ఇక్కడ కిడ్నీ వ్యాధులు ప్రబలే మూలాలను అన్వేషించే పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేవి తమ డిమాండ్ లు అని అన్నారు. ఈ దీక్షతో ప్రభుత్వానికి కొంతైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు జనసేన నేతలు చెప్పారు. శ్రీలంకలో దేశ అధ్యక్షులు కిడ్నీ వ్యాధి ప్రబలే ప్రాంతాలను స్వయంగా వెళ్లి పర్యవేక్షిస్తారని, అదే విధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడి బాధితులను పరామర్శించి వారి సమస్యలను తక్షమే తీర్చాలని అన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తమ దీక్షను మరింత తీవ్రతరం చేస్తామని, ఇది ప్రభుత్వానికి తమ తరపున, తమ అధినేత తరపున జారీ చేస్తున్న హెచ్చరిక అని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments