జేసీ నోరు అదుపులో పెట్టుకో : వైసిపి నేత అమర్నాధ్ రెడ్డి

Wednesday, May 30th, 2018, 06:22:57 PM IST

తెలుగు దేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడులో ఆ పార్టీనేతలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అలానే రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమంకోసం చేసే తీర్మానాల వంటివి చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్న మూడు రోజులపాటు ఎంతో అట్టహాసంగా జరిగిన మహానాడులో మూడవ రోజు అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు కొంత కలకలం రేపాయి. ఎందరు ఎన్నివిధాలుగా విమర్శించినా ముఖ్యమంత్రి చంద్రబాబు మృదు స్వభావి కాబట్టి సర్దుకుపోతారని, ఆ విధమైన మనస్తత్వం మీకు మంచిది కాదని, అందుకే వైసిపి అధినేత జగన్, దివంగత నేత రాజశేఖర రెడ్డి వంటి వారు ఎన్నిమాటలన్నా, ఎన్ని నిందలు తన మీద వేసిన చంద్రబాబు చూసి చూడనట్లు ఉంటారని అన్నారు.

జగన్ తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టుకుని చేసిన శవ రాజకీయాలు అందరికి గుర్తున్నాయని, ఇప్పటికే లక్ష కోట్లు తిన్న జగన్ ఇంకా డబ్బు మీద ఆశ చావలేదని అన్నారు. తండ్రిని, ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసినది చాలక పార్టీ ఒకటి పెట్టి మరొక్కమారు దోచుకోవడానికి ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. దొంగ చేతికి తాళాలు ఇవ్వడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరని, టిడిపి ప్రభుత్వంలో వారు ఎంతో ఆనందంగా వున్నారని, కాబట్టి రానున్న ఎన్నికల్లో మరోసారి టిడిపినే అత్యధిక మెజారిటీతో గెలిపించడం, అలానే చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమని అన్నారు. జేసి వ్యాఖ్యలపై వేదికపై వున్న టీడీపీ నేతలు తెగ నవ్వుకున్నారు. కాగా నేడు జేసి వ్యాఖ్యలపై పలువురు వైసిపి నేతలు మండిపడుతున్నారు. వారిలో అమర్నాధ్ రెడ్డి మాట్లాడుతూ, జేసీకి మైక్ ఇస్తే చాలు ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదని, ప్రధాన ప్రతిపక్ష నేతకు కనీస గౌరవం ఇవ్వలేని ఆయన ఇంకా తన నియోజక వర్గ ప్రజలకు ఏమి గౌరవం ఇస్తారని అన్నారు.

వైఎస్ బ్రతికి వున్నపుడు ఆయన అండదండలతో ఎమ్యెల్యే, మంత్రి అయిన జేసి, గత చరిత్ర మరిచి మాట్లాడుతున్నారని, ఏదో ప్రస్తుతం టీడీపీ లో చేరి చంద్రబాబు కుటిల రాజకీయాలను మెచ్చుకున్నంత మాత్రాన అంత అయిపోదని, ప్రజలు అంతా చూస్తున్నారు, రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని అన్నారు. కాబట్టి జేసి నోరు అదుపులో పెట్టుకుంటే ఆయనకే మంచిదని, లేకపోతె ఆయన నియోజకవర్గ ప్రజలే ఆయనకు గట్టిగా బుద్ధి చెపుతారని స్పష్టం చేసారు. టిడిపి బిజెపితో కుమ్మక్కయి చేసిన కుట్ర ఎప్పటికి ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేశారు. మరొక్క మారు జగన్ పై కానీ, వైఎస్ పై కానీ నిందలు వేస్తే తమ పార్టీ నేతలు ఎవరు సహించేది లేదని, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు……

  •  
  •  
  •  
  •  

Comments