ప్రత్యేక హోదా అడిగితే దేశద్రోహమా అంటున్న జేపీ…?

Monday, January 30th, 2017, 09:28:48 AM IST

jp
ఆరు నెలల క్రితం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కేంద్ర మంత్రులు అందరూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షాలు, యువత ప్రత్యేక హోదా కావాలంటే దేశద్రోహం ఎలా అవుతుందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. కొన్ని నెలల క్రితం వరకు వారు కోరుకున్న కోరికనే ఇప్పుడు యువత కోరుకుంటే తప్పేంటని జేపీ అన్నారు. ప్రత్యేక హోదా మాట ఎత్తడమే తప్పయిపోతుందా, పాలకుల్లో ఇలాంటి అసహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.

వైజాగ్ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని జేపీ విమర్శించారు. అధికారంలో ఉన్న వారికి నచ్చినా, నచ్చకపోయినా, ప్రజలకు తమ కోరికను తెలిపేందుకు నిరసన చేసే హక్కు ఉంటుంది. రాష్ట్రంలో ఒక పని జరిగితే బాగుంటుందని, కానీ ఆ పనిని ఎవరూ పట్టించుకోనపుడు పదిమంది కలిసి నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఎవరైనా, ఎంతమందైనా ఒక చోట కలిసి నిరసన తలఁపవచ్చని, ఇది ప్రజాస్వామ్య హక్కు అని జయప్రకాశ్ నారాయణ అన్నారు.