వైరల్ న్యూస్ : ప్రైమ్ పై ‘జియో’ ఏమి తేల్చనుంది?

Tuesday, March 27th, 2018, 07:34:54 PM IST

వాస్తవం చెప్పాలంటే రిలయన్స్ జియో రాకతోనే మన దేశంలో ఇంటర్నెట్, అలానే కాల్ రేట్ లు చాలా వరకు తగ్గి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి అనేది ఒప్పుకుతీరాల్సిన విషయం. ఆ విధంగా అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది వినియోగదారులకు చేరువైన టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో. ఆరంభం నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడమే కాదు, 4జీ స్పీడ్‌తో మొబైల్‌ డేటాను అందించి టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. జియో సేవలు ప్రారంభించిన మొదటి ఆరు నెలలు ఉచిత వాయిస్‌ కాల్స్‌తో పాటు, రోజుకు ఒక జీబీ చొప్పున ఉచిత డేటాను అందించింది. గతేడాది మార్చి 31 వరకూ ఈ ఆఫర్‌ కొనసాగింది.

ఆ తర్వాత ఏడాది కాల పరిమితి గల జియో ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్న వారికి రీఛార్జ్‌లను బట్టి కాల్స్‌, డేటా సేవలను అందిస్తోంది. అయితే మరో నాలుగు రోజుల్లో అంటే మార్చి 31వ తేదీతో జియో ప్రైమ్‌ సభ్యత్వం ముగియనుంది. ముఖ్యంగా రీఛార్జ్‌ ప్లాన్‌ విషయంలో ఉచిత వాయిస్‌కాల్స్‌, అదనపు డేటా సేవలను అందించింది. ఇతరులతో పోలిస్తే ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్న వారు అదనపు ప్రయోజనాలను పొందారు. ఏడాది కాలపరిమితి గల జియో ప్రైమ్‌ సభ్యత్వం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రూ.99తో మళ్లీ ప్రైమ్‌ సభ్యత్వాన్ని కొనసాగిస్తుందా, సభ్యత్వ రుసుములో పెంపు ఉంటుందా. వంటి ప్రశ్నలు జియో వినియోగదారుల మదిని తొలిచేస్తున్నాయి.

దీనిపై త్వరలోనే జియో నిర్ణయం తీసుకుంటుందని టెలికాం వర్గాలు భావిస్తున్నాయి. జియో ప్రైమ్‌ సభ్యత్వం లేకపోయినా ప్రస్తుతం ఉన్న ఆఫర్లు కొనసాగుతాయని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జియో ప్రతినిధులు కొందరు చెబుతున్నారు. ఏవైనా మార్పులు ఉంటే వెంటనే తెలియజేస్తామని వారు అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం జియో మాత్రం తమ వినియోగ దారులకు ఒక తీపి కబురు చెప్పబోతోంది అని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ జియో సంస్థనుండి అధికారిక ప్రకటన వెలువడేవరకు వేచిచూడక తప్పదు మరి…..