భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ వారిది..!

Thursday, February 16th, 2017, 03:50:03 AM IST


ఒక దొంగ దొంగతనం చేయాలంటే రాత్రిపూట మాత్రమే ప్రయత్నిస్తాడు.పగలు దొరికిపోతామన్న భయం ఉంటుంది.కానీ రాజకీయాలను అడ్డం పెట్టుకుని దోచుకునే వారికి వేళా పాలా ఉండదు అధికారం ఉన్నన్ని రోజులు, అధికారం ఉన్న నేతల అండదండలు ఉన్నన్ని రోజులు 24 x 7 దోచుకోవడమే వారిపని. చట్టాలన్నా, న్యాయ వ్యవస్థ అన్నా భయం, భక్తి రెండూ లేవు. వారి మీద కేసులు నమోదైనా ఆ కోర్టూ, ఈ కోర్టూ తిరిగి తుది తీర్పు వెలువడే సరికి వారి జీవితమే ముగిసిపోతుంది. ఆ ధైర్యంతోనే అక్రమార్కులు అవినీతికి పాల్పడుతున్నారు. జయలలిత కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పుతో న్యాయ మూర్తులు ఆ భయాన్ని కొంతైనా కలిగించడానికి ప్రయతించారని అంటున్నారు. అన్ని కేసులున్నా, ఇంతవరకు కనీసం సర్పంచ్ గా గెలవలేకపోయినా శశికళ ముఖ్యమంత్రి కావడానికి చేసిన ప్రయత్నాలు ఆశ్చర్యమని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సంచలన తీర్పులు తీసుకుంటేనే దేశంలోని నిజాయతీ పరులు ధైర్యంగా, అవినీతిపరులు కాస్తయినా భయంగా ఉంటారు. శశికళ కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ అమితవ్ రాయ్ పలు కీలక అంశాలను ఆ తీర్పు పేజీల్లో పొందుపరిచారు.శశికళ కేసు కోసం సిద్ధం చేసిన ఏడూ పేజీల తీర్పు లో అయన పలు విషయాలు ప్రస్తావించారు.

అవినీతి పరుల్లో అపరాధభావం కనిపించడం లేదు. సమాజం లో ఇలాంటి వీరిదే పైచేయి అవుతోంది. నిజాయితీపరులు దిక్కుతోచని స్థితి లోకి వెళుతున్నారు అంటూ అమితవ్ రాయ్ తీర్పు లో పేర్కొన్నారు. కేన్సర్ లా విజృంభిస్తున్న, ఆక్టోపస్ లా పట్టు బిగిస్తున్న అవినీతి మహమ్మారిని నిర్ములించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు.కొన్ని కేసుల్లో ఆధారాలు లేవనే అసంబద్ధ కారణాల వలన కూడా సరైన కఠిన మైన తీర్పు రావడం లేదని అమితవ్ రాయ్ అన్నారు. మనస్సాక్షి ప్రకారం, నైతిక పరిపక్వత ద్వారా చట్టాల పవిత్రతని కాపాడాలని ఆయన అన్నారు. కాగా జస్టిస్ అమితవ్ రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు దశాబ్దాల కాలంగా కోర్టుల్లో మోక్షం లేకుండా మగ్గుతున్న అవినీతి సంబందించిన కేసులపై అని విశ్లేషకులు అంటున్నారు. దేశం లో అవినీతో కేసులు లేని రాజకీయ నాయకులు చాలా తక్కువమంది కనిపిస్తారు. కేని కేసులు ఉన్నవారంతా దర్జాగానే ఉన్నారు. కారణం కోర్టు తీర్పుల్లో జాప్యం అనే వాదన వినిపిస్తోంది.

కాగా దేశం లోనే సంచలనం రేపిన 2 జి స్పెక్ట్రమ్ స్కామ్, బొగ్గు కుంభకోణం, గాలి జనార్దన్ రెడ్డి,జగన్ అక్రస్తుల కేసులు మొదలగువన్నీ అమితవ్ రాయ్ చేసిన వ్యాఖ్యల కిందికే వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఈకేసులన్నీ ఏళ్లుగా కోర్టుల్లో నానుతున్నవే. తాజాగా జయ అక్రస్తుల కేసులో తీర్పు కూడా తొందరగా రాలేదు. 1996 లో నమోదైన ఈ కేసు 2017 లో ముగిసింది. ఏళ్లపాటు ఆలస్యం జరిగినా ఇలాంటి తీర్పులు వస్తే చట్టాలంటే గౌరవం లేకపోయినా కనీసం భయమైనా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.