రివ్యూ రాజా తీన్‌మార్ : ‘కబాలి’ మీద కొంచెం బెటర్

Friday, June 8th, 2018, 09:10:31 AM IST

తెరపై కనిపించిన వారు : రజనీకాంత్, నానా పటేకర్, ఈశ్వరి రావ్
కెప్టెన్ ఆఫ్ ‘కాలా’ : పా.రంజిత్

మూల కథ :
ముంబై నగరంలోని మురికివాడ (ధారావి)లో పేద ప్రజలు నివసిస్తుంటారు. ఆ మురికివాడకి నాయకుడు కరికాలుడు (రజనీకాంత్). కాలా ఆ ప్రదేశాన్ని, ప్రజల్ని కాపాడుతుంటాడు. కానీ ముంబైలోని ప్రముఖ రాజకీయ పార్టీ లీడర్ హరిదాస్ (నానా పటేకర్) ధారావిని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు.

దాంతో`కాలా, అతని ప్రజలు హరిదాస్ కు అడ్డుపడుతారు. దాంతో హరిదాసు కాలాపై కోపం పెంచుకుంటాడు. అలా కాలాను టార్గెట్ చేసిన హరిదాస్ అతన్ని ఎలా కష్టాలు పెట్టాడు, వాటన్నిటినీ ఎదుర్కొని కాలా తన వాళ్ళని, ధారావిని ఎలా కాపాడుకున్నాడు అనేదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :
→ మొదటి విజిల్ సూపర్ స్టార్ రజనీకి వేయాలి. కాలా పాత్రలో చాలా బాగా నటించారాయన. ఒకవైపు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ చూపిస్తూనే మరోవైపు కొంత కామెడీని, రొమాన్సును పండిస్తూ సినిమాకు తన వంటి న్యాయం చేసి అభిమానుల్ని అలరించారు.

→ హీరో విలన్ కు షాక్ ఇచ్చే విరామ సన్నివేశం ఆకట్టుకుంది. అలాగే ద్వితీయార్థంలోని ప్రీ క్లైమాక్స్, ఫైట్స్ ఆకట్టుకున్నాయి. వీటన్నిటికీ కలిపి రెండో విజిల్ వేయొచ్చు.

→ ప్రతి నాయకుడి పాత్రలో నానా పటేకర్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా, రజనీ భార్యగా ఈశ్వరి రావ్, మాజీ ప్రేయసిగా హ్యూమా ఖురేషీలు బాగా నటించారు. వీరందరికి కలిపి మూడో విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

→ రజనీ సినిమా అంటే ప్రతి సీన్ ఎలివేషన్ సన్నివేశంలా ఉండాలని కోరుకుంటారు అభిమానులు. కానీ ఈ చిత్రంలో అటువంటివి రెండు మూడు మాత్రమే కనిపిస్తాయి. రజనీని పెద్దగా ఎలివేట్ చేసే పని పెట్టుకోలేదు రంజిత్.

→ సినిమా కథనం కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకునేలా ఉండి మిగతా చాలా చోట్ల నీరసంగా నడిచింది.

→ కథలోని ముఖ్యమైన పాత్రలకన్నా అనవసరమైన పాత్రలే ఎక్కువగా ఉండటం, ఫ్యామిలీ సీన్స్ కొంత ఎక్కువవడం బోర్ కొట్టించాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
→ సినిమాలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన సన్నివేశాలేవీ కనబడలేదు.

సినిమా చూసిన ఇద్దరి స్నేహితుల మధ్యన సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఎ : రజనీకాంత్ మాత్రం చాలా బాగున్నారు సినిమాలో.
మిస్టర్ బి : ఎస్.. రజనీ వరకు సూపర్.. కానీ సినిమానే
మిస్టర్ ఎ : సర్లే.. క్రితంసారి తీసిన ‘కబాలి’ మీద బెటరే కదా.
మిస్టర్ బి : అవును. ‘కబాలి’ మీద కాస్త బెటర్.

  •  
  •  
  •  
  •  

Comments