ఏమైతేనేం.. కడియాన్ని కట్టడి చేయగలిగారు !

Monday, October 1st, 2018, 11:34:15 AM IST

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. తనకు పార్టీమారి ఆలోచన ఏమాత్రం లేదని, తనను ఉపముఖ్యమంత్రిని చేసిన కేసిఆర్ వెంటే ఎప్పటికీ ఉంటాన్నయి కడియం స్ఫష్టం చేశారు. మొదట స్టేషన్ ఘం పూర్ నుండి తన కుమార్తెకు సీటు ఆశించిన ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకే కేసిఆర్ సీటు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

కేటిఆర్ బుజ్జగించే ప్రయత్నాలు చేసినా లొంగలేదు. నియోజకవర్గంలో రాజయ్యకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం పనులు కూడ మొదలుపెట్టింది. అయినా అధిష్టానం తగ్గకపోవడంతో గులాబీ దళం నుండి కడియం తప్పుకునే వాతావరణం కనబడింది. కానీ మధ్యలో ఏమైందో ఏమో, కేసిఆర్ ఏం చెప్పారో తెలీడం లేదు కానీ కడియం అటక దిగారు. తన కుమార్తె రాజకీయ ఆరంగేట్ర్రాన్ని సైతం వాయిదావేసుకుని రాజయ్య పట్ల ఉన్న అసమ్మతిని విరమించుకున్నారు.

అడగకుండానే ఉపముఖ్యమంత్రిని చేసిన కేసీఆర్ తోనే చివరి వరకు కలిసి ఉంటానని, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ టిఆర్ఎస్ గెలిచేలా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేసేశారు. నిప్పులో ఉప్పులా ఇన్ని రోజులు చిటపటలాడుతూ ఉన్న ఆయన ఇలా ఒక్కసారిగా చల్లబడిపోయి స్వామి భక్తిని చాటుకోవడం చూస్తుంటే కేసిఆర్ చతురతకు మెచ్చుకోకుండా ఉండలేం.