తెలంగాణకు కజాన్ హెలికాప్టర్స్ యూనిట్…

Wednesday, April 18th, 2018, 09:46:36 AM IST

ప్రపంచంలోని అతిపెద్ద హెలికాప్టర్ల తయారీదారుల్లో ఒకటైన కజాన్ హెలికాప్టర్స్ తెలంగాణలో తన యూనిట్‌ను స్థాపించేందుకు సుముఖత వ్యక్తంచేసింది. మంగళవారం తెలంగాణ.. రష్యాలోని తాతార్‌స్థాన్ రాష్ట్రం సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బిజినెస్ ఫోరంలో సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరైన తాతార్‌స్థాన్ అధ్యక్షుడు రుస్తమ్ మిన్నిఖనోవ్ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలకు ఫిదా అయ్యారు. ఇక్కడి ఆకర్షణీయమైన వృద్ధి.. ఇరు రాష్ట్రాల మధ్య సహకార అవకాశాలను పెంచుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇంజినీరింగ్, డిఫెన్స్, ఏరోస్పేస్, పెట్రోకెమికల్స్, చమురు, సహజవాయువు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో పరస్పర సహకారం గురించి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించారు. ఇన్నోపోలిస్ యూనివర్సిటీ వైస్ రెక్టార్ ఇస్కందర్ బరియేవ్, ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణ్‌లు కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యలో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిపథంలో దూసుకెళుతున్నది, అన్నిరంగాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. తెలంగాణ, తాతార్‌స్థాన్ మధ్య భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు. అంతకుముం దు మిన్నిఖనోవ్ టీహబ్, ఐఎస్‌బీ, మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లను సందర్శించారు. కార్యక్రమంలో తాతార్‌స్థాన్ ఉప ప్రధానులు ఆల్‌బర్ట్ కరిమోవ్, రోమన్ శాయ్‌కుదినోవ్, భారత్‌లో రష్యా కాన్సులేట్ జనరల్ సెర్గే కొటావ్, తాతార్‌స్థాన్‌కుచెందిన రాయబారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం తరుపున ఎంపీ జితేందర్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్‌లో గౌరవ రష్యన్ కాన్సుల్ టొగిరిల్లె పీటర్ హసన్, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాస్కాం రీజినల్ డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్, వీ హబ్ సీఈవో దీప్తి రెడ్డి హాజరయ్యారు.

గవర్నర్‌తో తాతార్‌స్థాన్ ప్రెసిడెంట్ భేటీ

రష్యాలోని తాతార్‌స్థాన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ రుస్తమ్ మిన్నిఖనోవ్ మంగళవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. దేశంలోని పలు రాష్ర్టాల పర్యటనలో భాగంగా మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకొన్నారు. పలురంగాలలో తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు మిన్నిఖనోవ్ గవర్నర్‌కు తెలిపారు. కాగా, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

  •  
  •  
  •  
  •  

Comments