పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్ గుడ్ న్యూస్.. లక్ష మీదే!

Monday, March 19th, 2018, 12:12:50 PM IST

కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. సాధారణంగా నేతలు పథకాలను ప్రవేశపెట్టగానే చేతులు దులుపుకుంటారు. ఆ తరువాత అవి ఎంతవరకు లబ్ది దారులకు అందుతున్నాయనే విషయం గురించి పట్టించుకోరు. కానీ కేసీఆర్ అలంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న పథకం కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకం. కులమతాలకు అతీతంగా పేదింటి ఆడపిల్ల పెళ్లికోసం తెలంగాణ ప్రభుత్వం 75వేల రూపాయలు అందిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఇస్తున్న మొత్తంలో కొంత డబ్బును పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ ఉదయం అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ మొదట షాదీ ముబారక్ – కల్యాణ లక్ష్మి పథకానికి గాను లక్షా నూటపదహారు రూపాయలకు పెంచుతున్నట్టు తెలిపారు. ఈ పథకం తనకు ఎంతో ఇష్టమైనది అని పేదింటి ఆడపిల్ల కోసం ఉపయోగపడుతోన్న ఈ పథకం ప్రజలకు కూడా బాగా నచ్చినట్లు కేసీఆర్ వివరించారు. ఈ పథకం వలన ఇప్పటి వరకు 3.65 లక్షల మందికి లబ్ది చేకూరిందని కేసీఆర్ తెలుపుతూ.. పేదరికం నిజంగా ఎన్నో రకాలుగా నరకాన్ని చూపిస్తుంది, పెళ్లి ఖర్చుకు భయపడి ఎన్నో భ్రూణ హత్యలు జరిగాయని అలాగే ఎంతో మంది అవివాహితలుగా మిగులుతున్నారని చెప్పారు. అయితే పరిపాలనలో వారిని ఆదుకోవాలని ఒక ఆడపిల్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కేసీఆర్ తెలిపారు.